విజయసాయిరెడ్డి – బండ్ల గణేష్ మధ్య ఏం జరిగిందో కానీ ఇద్దరూ ట్విట్టర్లో చెలరేగిపోతున్నారు. మొదట బండ్ల గణేష్ విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. మామూలుగా అయితే విజయసాయిరెడ్డి తన స్థాయిని చూసుకుని స్పందించకుండా వదిలేసేవారు. బయట ఎంపీ అయినా ట్విట్టర్లో మాత్రం విజయసాయిరెడ్డి స్థాయి అచ్చమైన వైసీపీ కార్యకర్తే కాబట్టి తనదైన శైలిలో బండ్ల గణేష్‌కు రిప్లయ్ ఇచ్చారు. పక్కలు.. వక్కలు అంటూ తన ట్రేడ్ మార్క్ లాంగ్వేజ్‌తో విమర్శలు గుప్పించడంతో ఇక బండ్ల గణేష్ ఊరుకుంటారా. ఆయన కూడా ప్రారంభించారు. విజయసాయిరెడ్డిని ఆయన భాషలోనే విమర్శించడం ప్రారంభించారు.
విజయసాయిరెడ్డి, బండ్ల గణేష్ మధ్య ప్రారంభమైన ఈ ట్విట్టర్ రచ్చ అలా సాయంత్రం వరకూ సాగుతూనే ఉంది. ఓ ట్వీట్ బండ్ల గణేష్ చేస్తే.. దానికి సమాధానంగా విజయసాయిరెడ్డి చేస్తారు. దానికి మళ్లీ గణేష్ కౌంటర్ ఇస్తారు ఇలా వరుసగా ఇద్దరి ట్విట్టర్ అకౌంట్లలో పెద్ద ఎత్తున ట్వీట్లు ఉన్నాయి. అయితే విజయసాయిరెడ్డి ఎక్కువ బ్యాడ్ అయిపోతున్నారు. బండ్ల గణేష్‌తో వాదన పెట్టుకోవడం ఏమిటని..ఆయనతో అన్నన్ని మాటల పడాల్సిన అవసరం ఏమిటని వైసీపీ నేతలు కూడా గింజుకుంటున్నారు.
ప్రతీ దానికి చంద్రబాబును తీసుకొచ్చే విజయసాయిరెడ్డి ఇందులోనూ అసువుగా చంద్రబాబు పేరు వాడేశారు. బండ్ల గణేష్ బాస్ చంద్రబాబు అనేశారు. దీంతో బండ్ల గణేష్ మరోసారి విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డిని దారుణంగా తిట్టారు. తన బాస్ పవన్ కల్యాణ్ అన్నారు. వీరి ట్విట్టర్ యుద్ధం వైరల్ కావడంతో… టీవీ చానళ్లు కూడా అందుకుంటున్నాయి. టీవీ5 మూర్తి ఏకంగా ప్రైమ్ టైమ్‌లోనే చర్చ పెట్టేశారు. బండ్ల గణేష్‌ను పిలిచారు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం మరింత హైలెట్ కానుంది.