ఈ ఐపీఎల్ లో ముంబైకి గట్టి షాక్ తగిలింది. వరుసగా ఆరో ఓటమితో… ఈ టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ సీజన్లో నిలవాలంటే గెలవక తప్పని పరిస్థితుల్లో లక్నో చేతిలోనూ ఓటమి మూటగట్టుకుని… భారీ పరాభవం పొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు చేసి, ముంబై ముందు 200 లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై 181 పరుగులకే పరిమితమైపోవడంతో 18 పరుగుల తేడాతో లక్నోకి విజయం వరించింది. ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ కప్పు గెలిచి.. తిరుగులేని జట్టుగా అవతరించిన ముంబై.. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ ఒక్క విజయం కూడా నమోదు చేసుకోలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, పొలార్డ్, బూమ్రా లాంటి మేటి ఆటగాళ్లు ఉన్నా, ఏమాత్రం ప్రభావితం చేయలేకపోతోంది. ఒకటి కాకపోతే, మరోటైనా గెలుస్తుందనుకుని ఆశపడుతుంటే… రోజు రోజుకీ ముంబై ఆట తీరు దిగజారిపోవడం అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఆటగాళ్లలో సమన్వయం లేకపోవడం, ఓవర్ కాన్ఫిడెన్స్ ముంబైకి ముప్పు తెచ్చిపెట్టాయి. సొంతమైదానంలో మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ముంబై రెచ్చిపోయి ఆడుతుంది. అయితే.. ఈసారి ఆ మ్యాజిక్కూ జరగలేదు. ఇప్పుడు ఎన్ని అద్భుతాలు చేసినా… ముంబై ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో ముందుకు రావడం అసాధ్యమని తేలిపోయింది. డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో ఇలా లీగ్ దశలోనే నిష్క్రమించిన జట్టు ఐపీఎల్ లో మరోటి లేదేమో. ఈ విషయంలోనూ ముంబైదే రికార్డు అనుకోవాలి.