జాబ్ మేళా పేరుతో తన టీంతో తిరుపతిలో దిగి మరీ హడావుడి చేసిన విజయసాయిరెడ్డి నిరుద్యోగులతో ఆటలాడుకున్నారు. భారీ కంపెనీలన్నీ ఉద్యోగాలివ్వడానికి వస్తున్నాయని నిరుద్యోగులందరూ రావాలని విస్తృత ప్రచారం కల్పించారు. చివరికి జాబ్ మేళాలో ఒక్కటంటే ఒక్క ఇంటర్యూ నిర్వహించలేదు. వచ్చిన వారి దగ్గర్నుంచి రెజ్యూమ్ తీసుకుని పంపించేశారు. తిరుపతి జాబ్ మేళాకు కడప, నెల్లూరు జిల్లాల నుంచి కూడా నిరుద్యోగులు తరలి వచ్చారు. తమ అర్హతలకు తగ్గట్లుగా ఉన్న ఉద్యోగాలకు ఇంటర్యూలు నిర్వహిస్తారని ఆశపడ్డారు. అయితే ఏ ఒక్క కంపెనీ కూడా ఇంటర్యూలు నిర్వహించలేదు.
రెజ్యూమ్స్ తీసుకుని సెలక్ట్ అయిన వారికి సోమవారం సమాచారం పంపిస్తామని చెప్పి పంపేశారు. అంటే సోమవారం సమాచారం రాని వారికి ఉద్యోగం రాలేదన్నమాట. రెజ్యూమ్ సమర్పించడానికి ఇతర ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి రావాలా అని నిరుద్యోగులు ఆర్గనైజర్లపై మండిపడ్డారు. అంతే కాదు విద్యార్హతలతో సంబంధం లేకుండా అక్కడ వారికి అప్లయ్ చేసుకునే అవకాశం వచ్చిన ఉద్యోగాలు సేల్స్ మెన్, సేల్స్ ఉమెన్, సెక్యూరిటీ గార్డు, హెల్పర్స్ ఉద్యోగాలు మత్రమే. ఇతర ఏ ఉద్యోగాలను కంపెనీలు ఆఫర్ చేయలేదు. ఇలాంటి ఉద్యోగాల కోసం కంపెనీలు ఎప్పుడూ ఎంపికలు నిర్వహిస్తూనే ఉంటాయని జాబ్ మేళాల అవసరమే లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేకంగా వెబ్ సైట్ ఓపెన్ చేసి నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చేసి వారి సమాచారం అంతా సేకరించిన విజయసాయిరెడ్డి మాత్రం తన జాబ్ మేళా గొప్ప విజయం సాధించినట్లుగా ప్రకటించుకున్నారు. 4784 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఉద్యోగాలు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడవద్దని ఇదంతా కంటిన్యూస్ ప్రోగ్రాస్ అని చెప్పుకొచ్చారు. అయితే కంపెనీలు ఒక్కరికీ కూడా ఉద్యోగం ఆఫర్ చేయలేదు. సోమవారం జాబ్ ఇస్తామని చెప్పాయి. మరి విజయసాయిరెడ్డికి ఆ లెక్క కంపెనీలు చెప్పాయేమో తెలియదు. అయితే మూడు జిల్లా నుంచి తరలి వచ్చిన ఉద్యోగార్థులు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కానీ కనీసం ఇంటర్యూలు కూడా చేయకపోవడంతో విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.