ఆంధ్రప్రదేశ్ పోలీసులు వివిధకేసుల సందర్బంగా నేరాలు ఎలా జరిగాయో చెబుతున్న తీరు.. వాటిలో ఉన్న ట్విస్టులు వైరల్గా మారుతన్నాయి . సినిమాలలోనే ఇలా లాజిక్కులు లేకుండా జరుగుతాయని అనుకుంటున్నాం కానీ.. నిజంగానే జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. అలాంటి అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా పోస్ట్ చేస్తున్నారు. తాజాగా నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన సాక్ష్యాలను మాత్రమే దొంగతనం చేయడం.. మూడు రోజులలో ఇద్దరు పాత దొంగలనుఅరెస్ట్ చేసి వారి పనేనని తేల్చడానికి ఎస్పీ విజయారావు చెప్పిన ఇనుము కథ వైరల్ అయింది.
టాలీవుడ్లోనూ ఇలాంటి లాజిక్ లేని స్టోరీలు తీసుకోరని సెటైర్లు వేస్తున్నారు. ఇదొక్కటే కాదు అనంతపురం జిల్లాలో మంత్రి ర్యాలీ కోసం రోడ్లన్నింటినీ పోలీసులు బ్లాక్ చేయడంతో వైద్యం అందక ఓ చిన్నారి చనిపోయిది. తీవ్రమైన విమర్శలు రావడంతో పోలీసులు ఓ సీసీటీవీ ఫుటేజీ విడుదల చేసి… పోలీసుల తప్పిదేమీలేదన్నారు. ఆ సీసీ టీవీ ఫుటేజీని చూసిన వారికి ఎక్కడా ర్యాలీ కనిపించడం లేదు. అంత ఖాళీగా ఆ రోజు రోడ్లెక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చూపించిన బండి మీద ఉన్న తాను కానీ.. తన భార్య కానీ కాదని స్వయంగా చిన్నారి తండ్రే ప్రకటించారు. పోలీసులు అది సృష్టించి కథ చెప్పారని సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభమయ్యాయి.
ఈ రెండు కీలక కేసులు కాబట్టి పోలీసులు చెప్పి నకథలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కానీ టీడీపీ నేతల్ని.. లేదా ఇతర వైసీపీ నేతల ప్రమేయం ఉన్న నేరాల కేసుల్లో గత మూడేళ్ల నుంచి పోలీసులు ఇలాంటి కథలే చెబుతున్నారు. కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇలాంటి కథలు మరీ ఎక్కువ కావడంతో పోలీసులు చెప్పేది కామనేగా అని జనం లైట్ తీసుకుంటున్నారు . కానీ పోలీసులు నవ్వుల పాలవుతున్నారన్న విషయాన్ని మాత్రం వ్యవస్థను కాపాడాల్సిన పెద్దలు గుర్తించలేకపోతున్నారు.