అమరావతిలో ముందు నుంచి వైసీపీకి మద్దతుగా ఉన్ రైతులు కూడా తమకు ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని… తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అమరావతి భూసేకణలో 33వేల ఎకరాల భూములు రైతులు ఇచ్చినప్పటికీ వైసీపీకి చెందిన కొంత మంది మాత్రం సమీకరణలో భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. వైసీపీ నేతలు అందర్నీ రెచ్చగొట్టి… కొంత మందిని మాత్రం భూములు ఇవ్వకుండా చేయగలిగారు. అయితే గత ప్రభుత్వం అలాంటి భూముల్ని యూ-1 జోన్‌గా పెట్టింది. అంటే రిజర్వ్ జోన్ అమ్మకాలు, కొనుగోలు చేయడానికి సాధ్య పడదు.
తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి గ్రామాల్లో 178 ఎకరాలు ఈ జోన్ కింద ున్నాయి. రాజధాని నిర్మాణానికి రూపొందించిన ప్లాన్ లో ఈ 178 ఎకరాలు లేకపోయినా వాటి అమ్మకాలు.. కొనుగోళ్లు పై ఆంక్షలు విధించడం తో అప్పటినుండి ఆ భూముల్ని అమ్మలేక.. అప్పులు తీర్చలేక.. వ్యవసాయం చెయ్యలేక రైతులు ఇబ్బంది పడుతున్నామని వారు చెబుతున్నారు. అప్పట్లో ఈ రైతులు భూసమీకరణ కింద భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు వారి వైపు కన్నెత్తి చూడటం లేదు. తాము రాగానే యూ – 1 జోన్ ఎత్తేస్తామని హామీ ఇచ్చి కూడా పట్టించుకోవడం లేదు.
ఆళ్ల తమను పట్టించుకోవడం లేదని ప్రభుత్వానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా లెక్క చేయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ పొలాలకు చెందిన 320 మంది రైతుల కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి !