నెలకు రూ. లక్షన్నర కోట్ల జీఎస్టీ వసూళ్లు అవుతున్నాయి. కేంద్రంఈ వివరాల్ని ఘనంగా ప్రకటిస్తోంది. గత ఏడాది ఇది నెలకు రూ. లక్ష కోట్లు ఉంటే గొప్ప. ఇప్పుడు రూ. లక్షన్నర కోట్ల వస్తుంది. ఇలా పన్ను వసూలు చేయడమే అభివృద్ధి గా చెబుతున్న ప్రభుత్వం మరింత పన్ను వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ప్రజల వద్ద నుంచి ఇంత పెద్ద మొత్తం వసూలు చేస్తున్నామన్న కనీస స్పృహ కూడా లేకుండా విచ్చలవిడిగా పన్నులు పెంచుతోంది. తాజాగా జీఎస్టీ శ్లాబులు మార్చి మరో యాభై వేల కోట్ల ఆదాయం పెంచుకోవాలని నిర్ణయించుకుంది.
5 శాతం శ్లాన్ను తొలగించి.. కొత్తగా మూడు, ఎనిమిది శాతం శ్లాబ్లు తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ కొన్నింటిపై జీఎస్టీ మినహాయింపు ఉంది. బ్రాండెడ్ కానటువంటి, సుంకం లేని ప్యాక్ చేయని కొన్ని ఆహార పదార్థాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. వీటన్నింటినీ 3 శాతం శ్లాబ్ కిందకు తీసుకురావడం ద్వారా మినహాయింపు ఉన్న వస్తువుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు. అలాగే 5 శాతం పన్ను ఉన్న వస్తువులను ఎనిమిది శాతంలోకి మార్చే అవకాశాలు ున్నాయి.
జీఎస్టీ చట్టం ఏర్పడినప్పుడు రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు లోటు భర్తీ చేయాలన్న నిబంధన ఉంది. అది ఈ ఏడాదితో ముగుస్తుంది. కానీ రాష్ట్రాలు మాత్రం ఇంకాపొడిగించాలంటున్నాయి. పొడిగించేందుకు సిద్ధంగా లేని కేంద్రం.. ప్రజల్నుంచి అదనంగా వసూలు చేసుకోవడాని ప్లాన్ చేస్తోంది. అధిక పన్నుల ద్వారా మాత్రమే ఆదాయాన్ని పెంచుకోవాలని రాష్ట్రాలు జీఎస్టీ మండలి ముందు ప్రతిపాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ రేట్లను హేతుబద్దీకరించాలనే డిమాండ్ మధ్య దీనిపై నివేదిక రూపొందించేందుకు జీఎస్టీ మండలి కమిటీని ఏర్పాటు చేసింది. అంటే ఇక మరింత పన్నుల బాదుడు కామనేనన్నమాట
జీఎస్టీకి అదనంగా ఆదాయపు పన్ను, పెట్రో పన్ను, ఎక్సైయిజ్ పన్ను, ఇంటి పన్ను. చెత్త పన్నులు.. ఇంకా అదనంగా ప్రభుత్వ ఆఫీసుల్లో ఏమైనా పనులు పడితే లంచాలు చెల్లించుకోవాల్సింది కూడా జనమే. పన్ను స్వామ్యం అంటే ఇదే మరి.