ఎవరైనా ముఖ్యమంత్రి ఏదైనా రాష్ట్రానికి వ్యక్తిగత పని మీద వెళ్లినా అధికార పని మీద వెళ్లినా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ. సంప్రదాయం. అంతే కానీ.. తమ రాష్ట్రానికి వేరే రాష్ట్ర సీఎం వచ్చారని ఆ రాష్ట్ర సీఎం హడావుడిగా వెళ్లి దర్శనం చేసుకోవడం అన్‌యూజవల్ అనుకోవచ్చు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ పర్యటనలో ఉన్న హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసేందుకు మంగళవారం ప్రత్యేకంగా విశాఖ వెళ్తున్నారు.
ఉదయం పదిన్నరకు బయలుదేరి… మధ్యాహ్నం రెండున్నరకు మళ్లీ తాడేపల్లికి చేరుకుంటారు. నేరుగా విశాఖలో ఖట్టర్ బస చేసిన రిసార్ట్‌కు వెళ్లి ఆయనతో సమావేశం ఆ తర్వాత నేరుగా తాడేపల్లికి వస్తారు. ఖట్టర్ షమ వెల్ నెస్ రిసార్టులో బస చేశారు. ఆయన రెండురోజుల కిందటే విశాఖ వచ్చారు. మొదట స్వరూపానంద స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత సింహాచలం అప్పన్నను కూడాదర్శించుకున్నారు . అయితే తిరిగి వెళ్లలేదు. ఆయన రిసార్టులోనే ఉన్నారు.
ఆయనతో భేటీ కావాలని జగన్ నిర్ణయించుకుని విశాఖ టూర్ ఫిక్స్ చేసుకున్నారు. ఇది మర్యాదపూర్వక భేటీనే అయ్యే అవకాశం ఉంది. ఏపీ, హర్యానా మధ్య ప్రత్యేకంగా ఎలాంటి వ్యవహారాలు లేవు. అయితే ఖట్టర్ ప్రత్యేకంగా వచ్చి స్వరూపానందను కలవడం.. ఆ తర్వాత జగన్ వెళ్లి కలుస్తూండటంతో రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానా సీఎం.