ఉగాది పండుగ రోజున హైదరాబాద్ రాడిసన్ బ్లూ పాజా హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై దాడి జరిపిన పోలీసులు చేసిన హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో ఉన్న వారంతా డ్రగ్స్ ఎడిక్ట్స్ అన్నంతగా హంగామా చేశారు. నూట యాభై మంది ఉంటే అందర్నీ స్టేషన్‌కు తరలించారు. లేనిపోని వ్యక్తుల పేర్లను ప్రచారంలోకి తెచ్చారు. చివరికి అసలు ఆ రోజున పబ్‌లో డ్రగ్సే లేవని కోర్టుకు చెప్పారు. పోలీసులు కోర్టుకు సమర్పించిన నిందితుల కస్టడీ రిపోర్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌ను అభిషేక్ ఉప్పాల నిర్వహిస్తున్నారు. మరికొంత మంది పార్టనర్లు ఉన్నారు. ఆ పబ్‌కు ఇరవై నాలుగు గంటల పర్మిషన్ ఉంది. ఉగాది రోజున తెల్లవారుజాము వరకూ పార్టీ జరిగింది. కానీపోలీసులు రెయిడ్ చేసి పట్టుకున్నారు. ఇందులో అనేక మంది వీఐపీలు ఉన్నారు. నాగబాబు కుమార్తె నీహారికతో పాటు రాహుల్ సిప్లిగంజ్.. ఓ మాజీ డీజీపీ కూతురు కూడా ఉన్నట్లుగా చెప్పుకున్నారు. ఆ సమయంలోనే నాలుగు గ్రాముల కొకైన్ దొరికినట్లుగా ఫోటోలు కూడా మీడియాకు ఇచ్చారు. నలుగురిపై కేసు నమోదు చేసి ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
కానీ నిందితుల్ని కస్టడీకి తీసుకున్న తర్వాత రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించారు. అందులో మాత్రం ఎక్కడా డ్రగ్స్ పట్టుబడినట్లుగా చెప్పలేదు. నిందితులకు డ్రగ్స్‌తో సంబంధాలుఉన్నట్లుగా కూడా ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపినట్లుగా తెలుస్తోంది. పబ్‌లో కొకైన్ విక్రయానికి సంబంధించిన ఆధారాలు దొరకలేదు. డ్రగ్స్ విక్రేతలతో అభిషేక్‌కు సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదు. అభిషేక్‌కు సంబంధించి గత మూడేళ్ల కాల్‌డేటాను పరిశీలించామని ఎలాంటి అనుమానాస్పద వ్యవహారాలు లేవని పోలీసులు కోర్టుకు తెలిపారు.
మొత్తంగా పోలీసులు కోర్టులో దాఖలు చేసిన కస్టడీ రిపోర్ట్ ప్రకారం ..అసలు అక్కడ డ్రగ్సే లేవని ఎవరికైనా అర్థమవుతుంది. మరి ఎందుకు పోలీసులు ఇంత హడావుడి చేశారు. అంత మందిని ఎందుకు మీడియా ముందు పరువు పోయేలా చేశారు.. అదే సమయంలో బంజారాహిల్స్ సీఐపై వేటు కూడా వేశారు. ఇవన్నీ ఎందుకు చేశారన్నది మిస్టరీగానే ఉన్నాయి.