వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ఇంచార్జిగా ఉన్న విజయసాయిరెడ్డికి ఆ పదవి ఊడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు ఇకపార్టీ తరపున ఏ ఒక్క జిల్లా బాధ్యతలు కూడా ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి డిసైడయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాల ఇంచార్జిలను జగన్ ఖరారు చేశారు. వాటిలో విజయసాయిరెడ్డి పేరు ఎక్కడా కనిపించలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రం మొత్తం నలుగురు చేతుల్లో ఉండేది. ఉత్తరాంధ్ర విజయసాయిరెడ్డి, ఉభయగోదావరి జిల్లా వైవీ సుబ్బారెడ్డి, కోస్తా జిల్లాలకు సజ్జల.. రాయలసీమకు పెద్దిరెడ్డి, వేమిరెడ్డి వంటి వారు ఇంచార్జులుగా ఉండేవారు.
వారే వ్యవహాలు నడిపేవారు. ఇప్పుడు అందర్నీ మార్చేయబోతున్నారు. విజయసాయిరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టనున్నారు. ఆయనకు కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. అదీ లేకపోతే… మొత్తంగా పక్కన పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఉత్తరాంద్రలో ఆయన పార్టీని నాశనం చేశారన్న అభిప్రాయంతో సీఎం జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రత్ేయకంగా పీకే టీం ద్వారా ఆయన సర్వేలు కూడా చేయించారు. చివరికి పార్టీ వ్యవహారాల్లో వేలు పెట్టనీయకపోవడమే మంచిదని అనుకుంటున్నారు.
జాబ్ మేళాలు కూడా పార్టీ హైకమాండ్ కు ఇష్టం లేదని.. కానీ విజయసాయిరెడ్డి మొండిగా పెట్టారని అంటున్నారు. అందుకే పార్టీ నేతలెవరూ ఆయనను కలవొద్దని ముందుగానే సందేశం పంపారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. విజయసాయిరెడ్డి పరిస్థితి వైసీపీలో రాను రాను తీసికట్టుగా మారుతోంది. రేపు రాజ్యసభ స్థానం కూడా రెన్యూవల్ చేయకపోతే.. వైసీపీలో ఆయన చాప్టర్ క్లోజ్ అయినట్లేనని కొంత మంది చర్చించుకుంటున్నారు.