అవసరమైతే జాతీయ పార్టీ పెడతాననని కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడా అవసరం కనిపిస్తోందన్న అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. అదే వ్యూహంతోనే కేసీఆర్ జాతీయ స్థాయిలో రైతు నేతగా ప్రొజెక్ట్ అయ్యేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమవ్వాలన్న సలహాలున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ బలపడకపోతూడంటంతో ఆ స్థానం తమకు దక్కాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ బలం మీద నమ్మకం ఉన్న వారు ఆ పార్టీతోనే నడుస్తున్నారు.
తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా మత వ్యతిరేక లేఖ రాసిన పార్టీల్లో కాంగ్రెస్ సహా పదమూడు మిత్రపక్షాలున్నాయి. అవన్నీ కాంగ్రెస్ పార్టీతోనే ఉండటం ఖాయం. లేక మీద సంతకం చేయికపోయినా ఎన్సీపీ, శివసేన వంటి పార్టీలు కాంగ్రెస్తోనే ఉంటాయి. అంటే కేసీఆర్ చెప్పే మూడో కూటమి… ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదు. ఎస్పీ, తృణమూల్ పార్టీలతో కలిసి కూటమి సాధ్యం కాదు. ఎందుకంటే వారి తీరు భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి కేసీఆర్.. జాతీయ కొత్త పార్టీ పెట్టే దిశగా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.
నిజానికి కేసీఆర్ గతంలోనే జాతీయ పార్టీ ప్రకటనకు ఏర్పాట్లు చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో ఆయన తోసి పుచ్చారు. ఇప్పుడు మాత్రం చాలా సీరియస్గా వర్కవుట్ చేస్తున్నారని.. వరుసగా ఢిల్లీ పర్యటనల వెనుక ఓ కారణం కూడా అదేనని చెబుతున్నారు. మొత్తంగా కేసీఆర్ తన జాతీయ రాజకీయాల విషయంలో ఇతరులపై ఆధారపడదల్చుకోలేదు. సొంతంగానే ఎదగాలనుకుంటున్నారు.