కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే ఏం చేయాలో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఓ రూట్ మ్యాప్ ఇచ్చారు. దీనిపై సోనియా గాంధీ సీరియస్గా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ప్రశాంత్ కిషోర్ని పార్టీలో చేర్చుకోవాలని అలాగైతే ఆయన ఇతర ఏ పార్టీకి సేవలు అందించకుండా తమకే పని చేస్తారని సోనియా భావిస్తోంది. ఈ అంశాలపై సోనియా గాంధీ తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో ప్రశాంత్ కిషోర్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కనీసం 370 స్థానాల్లో పోటీ చేయాలని, కొన్ని రాష్ట్రాల్లో మిత్ర పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలని సూచించారు.
ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయాలని తమిళనాడు, పశ్చమబెంగాల్, మహారాష్ట్ర లో మిత్రపక్షాలతో పొత్తు కుదుర్చుకోవాలని పీకే సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలపై కాంగ్రెస్ నేతల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీహార్లో ఆర్జేడీని వదులుకోవాలని చెప్పడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీలోకి పీకే వస్తే సీనియర్లకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఆయన సలహాలతోనే పార్టీని నడుపుతారు. అందుకే సీనియర్లు ఎక్కువ మంది పీకే రాకను వ్యతిరేకిస్తున్నారు.
అయితే పీకేకు ఎంత ప్రాధాన్యం ఇస్తారన్నదాన్ని స్పష్టంగా చెప్పి.. ఆయనను పార్టీలోకి తీసుకోవాలనుకుంటున్నారు. రోజు రోజుకు కుంగి కృశించి పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఉత్థానానికి మళ్లీ పీకే సాయం చేస్తారని భావిస్తున్నారు. ఇంత బతుకు బతికిన కాంగ్రెస్ పార్టీకి చివరికి పీకేనే దిక్కయ్యారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.