నా మాటంటే మాటే. ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయకూడదు. ఎవరైనా అలా చేసినా వాళ్లకి పార్టీలో నూకలు చెల్లినట్లే అన్నట్లుగా నిన్నా మొన్నటి వరకూ ఉన్న పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. సీఎం జగన్ అసంతృప్తులకు బుజ్జగింపులను తన తన డైరీలో రోజూ చోటు కల్పిస్తున్నారు. తాజాగా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం కోసం విశాఖ వచ్చిన సీఎం జగన్ ఎయిర్ పోర్టులోనే పార్టీ నేతలతో కొంత సేపు చర్చించారు. మొత్తంగా మంత్రి పదవి దక్కలేదని.. మంత్రి పదవిని తొలగించాలని అసంతృప్తికి గురైన వారిని ఓదార్చడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. మంత్రి పదవి దక్కలేదని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అయింది.
మీడియాతో కూడా ఆయన తన బాధ చెప్పుకున్నారు. దీంతో విశాఖ ఎయిర్‌పోర్టులో ధర్మశ్రీని జగన్ ఓదార్చారు. ఆయనకు పార్టీ పరంగా ప్రాముఖ్యతను ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా చాన్సిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మంత్రి పదవి నుంచి తప్పించారని .. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారు. కొత్త మంత్రి గుడివాడ అమర్నాథ్తో ఆయన ముభావంగా ఉంటున్నారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను కూడా ఓదార్చారు. తొలగించిన మంత్రులకు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తామని ఇప్పటికే చెప్పారు. ఈ హామీలో భాగంగాఅవంతి శ్రీనివాస్‌కు విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చేందుకు జగన్ సంసిద్ధతం వ్యక్తం చేసిటన్లుగా తెలుస్తోంది.
ఈ ఇద్దరు నేతల్ని త్వరలో అమరావతికి పిలిపించి మాట్లాడిన తర్వాత జిల్లా అధ్యక్షులపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. విశాఖ పర్యటనలో సీఎం జగన్‌ను పలువురు పార్టీ ఎమ్మెల్యేలు నేతలు కలిశారు. వారందరితో సీఎం జగన్ కలివిడిగా మాట్లాడారు. గతంలో జగన్ పర్యటనకు వచ్చినప్పుడు ముందస్తు అనుమతి ఉన్న ఒకరిద్దర్ని మాత్రమేమాట్లాడేందుకు అనుమతి ఇచ్చేవారు. అయితే ఇప్పుడు మాత్రం జగన్ వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని విశాఖ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు.