ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఇద్దరు సీనియర్ మంత్రులు మౌనం సీఎం జగన్‌ను ఇబ్బంది పెడుతోంది. వారిద్దరికీ మళ్లీ మంత్రి పదవులు ఇచ్చినా బాధ్యతలు తీసుకోవడం లేదు. దీనికి కారణం వారికి కేటాయించిన శాఖలు నచ్చకపోవడమే. అందుకే ఇప్పటి వరకూ బాధ్యతలు కూడా తీసుకోలేదని తెలుస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ కేటాయంచారు. ఆయనకు ఆ శాఖ అంటే ఆసక్తి లేదు. ఈ విషయం మొదటే వెల్లడయింది. విద్యాశాఖను చూసుకుంటూ తాను పార్టీపై దృష్టి పెట్టలేనని.. ఇప్పటికే మున్సిపల్ శాఖపై తనకు పట్టు చిక్కింది కాబట్టి అదే శాఖ ఇవ్వాలని జగన్ వద్దకు ప్రతిపాదన పంపినట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో మరో సీనియర్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికూడా బాధ్యతలు తీసుకోలేదు. ఆయన బాధ వేరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. బొత్స తనకు పాత శాఖే కావాలంటే .. బుగ్గన మాత్రంతనకు పాత శాఖ వద్దంటున్నారు. బుగ్గన ఇప్పటి వరకూ ఆర్థికమంత్రిగా ఉన్నారు. తాజాగా కూడా ఆయనకు ఆర్థికశాఖే కేటాయించారు. కానీ ఈ శాఖ మాత్రం వద్దని బుగ్గన చెబుతున్నారు. నిజానికి ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గన చేసిందేమీ లేదు. అప్పుల కోసం ఢిల్లీలో అయినవాళ్లకు..కానివాళ్లకు శాలువాలు కప్పడం మినహా.మిగతా మత్తం సజ్జలే చూసేవారు. ఆ మాత్రం దానికి తనకు ఆ శాఖ వద్దని అంటున్నారు. మరొకటి ఇవ్వాలంటున్నారు.
ఈ ఇద్దరు మంత్రులు బాధ్యతలు తీసుకోకుండా శాఖల్లో మార్పులు కోరుకుంటున్నారు. వారి ప్రతిపాదనలు ప్రస్తుతం జగన్ వద్దకు వెళ్లాయి. జగన్ పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ తాను చెప్పిందే శాసనం అన్నమూడ్ నుంచి బయటకు వచ్చారని… పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అందర్నీ పిలిచి బుజ్జగించడమే కాదు..వీలైతే డిమాండ్లను పరిష్కరిస్తున్నారని అంటున్నారు. అదే నిజం అయితే.. బొత్స, బుగ్గన శాఖలు మారే అవకాశం ఉంది.ఒక వేళ బొత్సకు ఆర్థిక శాఖ ఇస్తే ఆయన పరిస్థితి పనం మీద నుంచి పొయ్యిలో పడినట్లవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.