దొంగతనాలు.. దోపిడీలు.. ఆర్థిక నేరాలు.. లెక్క తేలని నగదు ఇలాంటి నేరాల్లో పోలీసులు సొత్తును స్వాధీనం చేసుకోవడం.. రికవరీ చేయడం వంటివి చేస్తూంటారు. ఏం చేస్తారు ? కోర్టుల్లో జమ చేస్తారు . కేసుల్లో తేలిన వారికీ ఇచ్చేయాలని కోర్టు ఆదేశిస్తూ ఉంటుంది. ఇలా జమలు… చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. కానీ కొద్ది రోజుల నుంచి ఏపీలో జమలే కానీ.. కోర్టు తీర్పులు వచ్చినా చెల్లింపులు చేయడం లేదు. ఎందుకు అంటే ఖాతాల్లో డబ్బుల్లేవనే సమాధానం వస్తోంది. అదేంటి … రికవరీ సొమ్ము జమ చేసేశాం కదా అంటే… ఏపీ అధికారులు విచిత్రంగా చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ జమ చేసిన వాటిని ప్రభుత్వం వాడేసుకుంది మరి.
ఏపీ ప్రభుత్వం ఎక్కడ డబ్బుల వాసన కనిపించినా వదలడం లేదనే దానికి ఇంత కన్నా ప్రత్యక్ష ఉదాహరణ ఏమీ ఉండు. జప్తు చేసిన లేదా దొంగతనాల్లో రికవరీ చేసిన సొత్తును యజమానులకు ఇవ్వాలని కోర్టులు ఆదేశిస్తున్నా ఇవ్వలేకపోతున్నారు. న్యాయస్థానాళ ఖాతాల్లో.. న్యాయమూర్తుల ఖాతాల్లో ఉండాల్సిన నగదు లేకపోవడమే దీనికి కారణం. ప్రభుత్వం ఆ నగదును మళ్లించుకుంది. కానీ చెల్లింపులుచేయడానికి మాత్రం ఆలస్యం చేస్తోంది.
ఏపీలో నెలకు రూ. వంద కోట్ల వరకూ ఇలా కక్షిదారులకు చెల్లింపులు చేస్తూంటారు. అంతే స్థాయిలో జమలూ ఉంటాయి. కానీ ప్రభుత్వం కోర్టు ఖాతాల్లో ఉన్న నగదును వాడేసుకుంది. ఇప్పుడు తీర్పులు ప్రకారం చెల్లించడం లేదు. దీంతో తీర్పులు పొంది తమ సొమ్ము తమకు వస్తుందని ఎదురు చూస్తున్న వారికి నిరాశ తప్పడం లేదు. ప్రభుత్వం తీరు చూసి వారు షాక్కు గురవుతున్నారు. ఈ అంశంపై న్యాయస్థానాలను ఎవరైనా ఆశ్రయిస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.