పార్టీ అధినేత పుట్టిన రోజు అంటే పార్టీ నేతలు, క్యాడర్లో ఉండే జోష్ అంతా ఇంతా కాదు. అదే అధికార పార్టీ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. కానీ ఏపీలో భిన్నమైన పరిస్థితి ఉంది. ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును ఎవరూ పట్టించుకోలేదు. ఏప్రిల్ 19న వైఎస్ విజయలక్ష్మి జన్మదినం. ప్రతీ ఏటా పెద్ద ఎత్తున చేస్తారు. సాక్షి మీడియాలోనూ హోరెత్తిస్తారు. కానీ ఈ సారి ఆమె పుట్టిన రోజుకు… ఎవరైనా శుభాకాంక్షలు చెప్పారా లేదా అన్నదానిపైనా స్పష్టతలేదు.
వైఎస్ విజయలక్ష్మి తెలంగాణలో పాదయాత్రలో ఉన్న కుమార్తె షర్మిల సమక్షంలోనే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. కొంత మంది కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కానీ ఏపీ నుంచి ఎలాంటి శుభాకాంక్షలు ఆమెకు అందలేదు. మీడియా కోసం అయినా చెప్పలేదు. ఓ రకంగా పార్టీ గౌరవాధ్యక్షురాలి పుట్టినరోజును వైసీపీ నేతలు మర్చిపోయారు. మర్చిపోయారు అనడం కంటే… జరిపితే ఎవరికి కోపం వస్తుందోనని ఆగిపోయారని అనుకోవచ్చు.
సీఎం జగన్ కుటుంబంలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న పరిస్థితి ఉందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే సీఎం జగన్ ను ఈ మధ్య విజయలక్ష్మి కలవడం లేదు. గౌరవాధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతానని ఆమె నేరుగా జగన్‌కే చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. గౌరవాధ్యక్షురాలి పుట్టిన రోజును పట్టించుకోకపోవడంతో అదే నిజమని ఎక్కువ మంది భావించే పరిస్థితి ఏర్పడింది.