హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యపై కేంద్ర మానవవనరులశాఖమంత్రి స్మృతి ఇరాని అబద్ధాలు చెబుతున్నారని అతని తల్లి రాధిక ఆరోపించారు. ఆమె ఇవాళ రోహిత్ స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మంత్రి నిన్న, మొన్న పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో విషయాన్ని పక్కదోవ పట్టించటానికి ప్రయత్నించారని విమర్శించారు. రోహిత్ తన చివరి లేఖలో ఎవరినీ నిందించలేదని పేర్కొన్నట్లు మంత్రి చెప్పారని, అయితే బీజేపీపై అతను ఫేస్బుక్లో రాసిన విషయాన్ని ఒకసారి చదవాలని అన్నారు. మంత్రి పార్లమెంట్లో చెబుతున్న అబద్ధాలను తాము బయటపెడతామని చెప్పారు. రోహిత్ ఆత్మహత్య చేసుకున్న వెంటనే, అతనిని కాపాడనీయకుండా, అక్కడకు వైద్యుడిని వెళ్ళనీయకుండా కొందరు అడ్డుకున్నారని మంత్రి మొన్న పార్లమెంట్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఆ వాదనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజ్యలక్ష్మి ఖండించారు.