తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్రలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు ఉదరగొట్టారు. ఇప్పటికి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైన వారం రోజులు అయింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే సాగుతోంది. అయితే ఇంత వరకూ ఒక్కరంటే ఒక్కరు పార్టీలో చేరలేదు. ఎక్కడిక్కకడ ఓ మాదిరి గుర్తింపు ఉన్న నేతలను అయినా పార్టీలో చేర్చుకుందామని ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదు. కొంత మందితో జరిపిన చర్చలు టిక్కెట్ ఇస్తారా లేదా అన్న దగ్గర ఆగిపోతున్నాయి. నిజానికి మాజీ మంత్రి.. టీఆర్ఎస్ కీలక నేత జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆయనతో కూడా చర్చలు తెగడం లేదు.
జూపల్లి కృష్ణారావు టిక్కెట్ కోసం హామీ పొందే స్థాయి నేత కాదు. అంత కంటే పెద్ద నేతనే . ప్రస్తుతం బీజేపీలోనే ఉన్న మాజీ మంత్రి డీకే అరుణకు.. జూపల్లి కృష్ణారావుకు సరిపడదు. అందుకే తాను పార్టీలో చేరితే తన ప్రాధాన్యం తనకు ఉండేలా ఆయన హామీ కోరుతున్నారు. ఆయనకు హామీ ఇస్తే డీకే అరుణను నిర్లక్ష్యం చేసినట్లవుతుంది. అందుకే ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇతర నేతల సంగతి కూడా అంతే.. పార్టీలో చేరికలను పెంచి..హైకమాండ్ దృష్టిలో పడాలని బండి సంజయ్ భావిస్తున్నారు.
వచ్చేనెల పధ్నాలుగో తేదీ వరకూ రెండో విడత పాదయాత్ర సాగనుంది. ఆ లోపు అయినాచర్చలు పూర్తి చేసి .. ముగింపు సభకు అమిత్ షాను ఆహ్వానించి కండువాలు కప్పాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఒక వేళ ఎవరూ చేరకపోతే..,బీజేపీలో చేరడానికి ఎవరూ సిద్ధంగా లేరన్న అభిప్రాయం బలపడుతుంది. అందుకే బీజేపీ అగ్రనేతలు కూడా చేరికలపై విస్తృతంగా మంతనాలు జరుపుతున్నారు.