అలవెన్స్‌లు అన్నీ కలిపి మూడున్నర లక్షల జీతం వస్తూంటే.. దాన్ని రూ. అరవై ఐదు వేలకు పరిమితం చేసింది ఏపీ ప్రభుత్వం. మరి మండిపోదా ?. అతి కష్టం మీదతెచ్చుకున్న రాజకీయ పదవుల్లో అధికారులు లేకుండా జీతాలు కూడా లేకుండా చేస్తా ఎలా? అని వైసీపీలోని నేతలు ఇప్పుడు గుస్సా అవుతున్నారు. రోజా తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ అయిన మెట్టు గోవిందరెడ్డి అనే నేతకు ఈవిషయంలో మండిపోయింది. తనకు ఆ రూ. ఆరవై ఐదువేలు కూడా వద్దని ప్రభుత్వమే ఉంచుకోవాలని .. తాను ఉచితంగా పని చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన తనకు.. గౌరవ వేతనం అవసరం లేదని లేఖ రాశారు.
ఇంత కాలం జీతం తీసుకున్న గోవిందరెడ్డికి హఠాత్తుగా ఎందుకు సేవాభవం… వచ్చిందటే.. జీతం తగ్గించేశారు మరి. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, సంస్థల ఛైర్మన్ల వేతనాలపై ప్రభుత్వం ఇటీవల సీలింగ్ విధించింది. వేతనాలు 65 వేల రూపాయలు మించరాదని పేర్కోంది. ఇటీవలి వరకూ ఏపీఐఐసీ ఛైర్మన్‌కు ఆర్ కేటగిరీ హోదాను ప్రభుత్వం కల్పించింది. వేతనంతో కలిపి ఇతర సౌకర్యాలకుగానూ 3లక్షల 82వేల రూపాయల వరకూ చెల్లించేవారు. కానీ ప్రభుత్వం కార్పొరేషన్ ఛైర్మన్ గౌరవ వేతనాలపై సీలింగ్ విధించటంతో ఒక్కసారిగా ఏపీఐఐసీ ఛైర్మన్ వేతనం రూ.65 వేలకు తగ్గింది. ఈ మొత్తం తీసుకున్నామన్న పేరు కూడా ఎందుకనుకున్నారేమో కానీ అసలే వద్దని లేఖ రాశారు.
ఏపీ ప్రభుత్వం పార్టీ నేతలకు పదవులు ఇచ్చేందుకు ఎన్నో కార్పొరేషన్లు పెట్టింది. వాటన్నింటికీ నియామకాలు చేసింది. ఇప్పుడు అందరికీ ఎంతో కొంత గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. అనేక మందికి జీతాలు రావడం లేదు. అయినా ఎవరూ బయటపడటం లేదు.త ప్రాధాన్యత ఉన్న ఏపీఐఐసీ చైర్మన్ లాంటి పోస్టులకు కూడా తీతాలు అరవై ఐదు వేలకు పరిమితంచేయడంతో వారు ఏడవలేక నవ్వుతున్న పరిస్థితి. సలహాదారులు అయితే ఇంకా ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. వారి జీతాలపై సీలింగ్ విధించారో లేదో స్పష్టత లేదు.