తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారం చిత్ర విచిత్ర ములుపులు తిరుగుతోంది. ఇటీవల ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాదాపుగా 40 రైస్ మిల్లుల్లో చేసిన తనిఖీల్లో ఐదు లక్షలకుపైగా బస్తాల బియ్యం గోల్ మాల్ అయినట్లుగా నిర్ధారించింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఓ లేఖ రాశారు. 40 రైస్ మిల్లుల్లోనే అంత భారీ స్కాం జరిగితే..ఓవరాల్‌గా అది వేల కోట్లలోనే ఉంటుందని తక్షణం సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ నేతలు బియ్యం గోల్ మాల్‌కు పాల్పడ్డారని విచారణ చేయిస్తామని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ నేతలకే కాదు బీజేపీ నేతలకు కూడా మైండ్ బ్లాంకయ్యే రెస్పాన్స్ ఇచ్చారు.
ఢిల్లీలో ధాన్యం కొనుగోళ్లపై మీడియా సమావేశం పెట్టిన ఆయన అన్ని రైస్ మిల్లుల్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో విచారణ చేయించాలని కేంద్రం నిర్ణయించిందని ప్రకటించారు. అంత వరకూ బాగానే ఉంది.. తర్వాత అసలు విషయం కూడా ఆయనే చెప్పారు. ఎఫ్‌సీఐకి రైస్ మిల్లులతో సంబంధం ఉండదన్నారు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే ధాన్యం సేకరణ చేస్తుందన్నారు. ధాన్యం సేకరించి వాటిని రైస్ మిల్లలకు పంపేది ప్రభుత్వమేనని.. రైస్ మిల్లులు అక్రమాలకు పాల్పడుతూంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రైస్ మిల్లులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం ఏమయ్యాయో స్పష్టత కావాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తేల్చాలన్నారు.
అసలు తెలంగాణ ప్రభుత్వ పార్టీ అయిన టీఆర్ఎస్ నేతలే ఈ గోల్ మాల్‌కు పాల్పడ్డారని రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తూంటే.. మళ్లీ ఆ బియ్యం ఏమయ్యాయో తేల్చాలంటూ కేసీఆర్ సర్కార్‌నే కిషన్ రెడ్డి అడగడం… వారిని ఆశ్చర్య పరుస్తోంది. ధాన్యం విషయంలో కేసీఆర్ బీజేపీని కార్నర్ చేస్తున్నా.. బీజేపీ మాత్రం ఏమీ చేయలేకపోవడం ఏమిటన్న సందేహం అందరిలోనూ వస్తోంది. రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కిషన్ రెడ్డి కూడా సమర్థంగా తిప్పి కొట్టలేకపోతున్నారు.