సోము వీర్రాజుఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఒకటే డైలాగ్ రిపీటెడ్గా చెబుతూ ఉంటారు. అదేమిటంటే ఏపీలో ఉన్న పథకాలన్నీ కేంద్రానివేనని..ఆ డబ్బులన్నీ ఢిల్లీ సర్కార్ ఇచ్చిందేనని చెబుతుంటారు. అయితే హఠాత్తుగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న ఓ పథకం విషయంలో మాత్రం ఆయన రివర్స్ వ్యాఖ్యలుచేశారు. ఏపీప్రభుత్వం రేషన్ బియ్యానికి బదులుగా నగదు ఇస్తామంటూ కొత్త స్కీమ్ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. దీన్ని సోము వీర్రాజు గట్టిగా ఖండించారు. బియ్యం బదులు నగదు ఇస్తామనడంలో ప్రభుత్వ కుట్ర కోణం దాగి ఉందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శించారు.
ప్రజలపై బలవంతంగా ఒత్తిడి పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి రేషన్ పథకాన్ని అటకెక్కించేందుకే ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతుందని, పోర్టుల ద్వారా బియ్యాన్ని విదేశాలకు పంపించే ప్రయత్నం చేస్తోందని ఆయన వెల్లడించారు. అయితే సోము వీర్రాజు వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. 2017 లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్నే తాము అమలు చేస్తున్నామని, దీనిని విమర్శిస్తే ప్రధాని మోదీని విమర్శించినట్లే అవుతుందని మంత్రి కారుమూరి తేల్చి చెప్పారు.
ఇప్పటికే చండీగఢ్, పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలీ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇది అమలులో ఉందన్నారు. వెళ్లి మోదీనే అడగాలని తేల్చి చెప్పారు. నిజానికి ఏపీ ప్రభుత్వం కేంద్ర సంస్కరణాలనే అమలు చేస్తోంది. అందుకే తప్పని సరిగా అమలుకు ప్రయత్నిస్తోంది. దీని వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయం కూడా ప్రభుత్వంలో ఉంది. అయినా సోము వీర్రాజు గట్టిగా విమర్శించేసి.. ఇది కూడాకేంద్ర ప్రభుత్వ నిర్ణయమేనన్న నిజాన్ని అందరికీ తెలిసేలా చేశారు.