ఆదిత్య బిర్లాకు చెందిన గ్రాసిమ్ రసాయనాల పరిశ్రమను తూర్పుగోదావరి జిల్లాలో నేడు సీఎం జగన్ ప్రారంభిస్తున్నారు. పరిశ్రమ వస్తే సంతోషమే కానీ.. జగన్ ఈ పరిశ్రమ గురించి ప్రతిపక్ష నేతగా ప్రజల్లో ఎంత విద్వేషం.. వ్యతిరేతక రెచ్చగొట్టారో “నాడు – నేడు” పథకం కిందర్తు చేసుకుంటే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు. పాదయాత్రలో ఎన్నికల ప్రచారం గ్రాసిమ్ పరిశ్రమపై జగన్ చేసిన ప్రచారం ఓ రేంజ్లో ఉంది. అది విష రసాయనాల పరిశ్రమ అని .. ప్రజల్ని చంపడానికే పెడుతున్నారని ఆరోపించారు. తక్షణం అనుమతులు రద్దు చేయాలన్నారు. ఈ ప్రభుత్వం చేయకపోతే తాము వచ్చిన వెంటనే చేస్తామన్నారు.
ప్రజలు జగన్ మాటలతో ఉద్రేకపడిపోయారు. అనేక ఉద్యమాలు చేశారు. ఐదు వందల మంది వరకూ కేసుల పాలయ్యారు. వారిపై కేసులు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసుకోవడంతో స్వయంగా ప్రారంభించడానికి సీఎం జగన్ ఏ మాత్రం మొహమాటపడటం లేదు. ఎప్పట్లాగే పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేసుకుని ఆయన పరిశ్రమను ప్రారంభించడానికి వస్తున్నారు. జగన్ తీరు చూసి అప్పట్లో పరిశ్రమ వద్దని ఆయన చెప్పిన మాటలు విని ఉద్యమాలు చేసిన వారంతా నోరెళ్లబెట్టి చూస్తున్నారు.
ఒక్క గ్రాసిమ్ విషయంలోనే కాదు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంపై చేసిన వ్యతిరేక ప్రచారాలన్నింటిలోనూ ఇలా నాడు – నేడు అనే స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. నాడు తప్పన్నారు. నేడు రైట్ అంటున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి ఐటీ కంపెనీలు.. రిలయన్స్ లాంటి సాంకేతిక ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల్ని భూములు లాక్కుని వెళ్లగొట్టిన సీఎం జగన్ తాను వ్యతిరేకించిన రసాయన పరిశ్రమలకు మాత్రం రెడ్ కార్పెట్ వేసి సహకరిస్తున్నారు. జగన్ తీరు చూసి ముక్కు మీద వేలేసుకోవడం తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు.