పబ్లిసిటీ పరంగా `ఆర్.ఆర్.ఆర్` సినిమా మొదట్నుంచీ చివరి వరకూ ఓ స్ట్రాటజీని కొనసాగిస్తూ వచ్చింది. అది వర్కవుట్ అయ్యింది కూడా. కాకపోతే చివర్లో మీడియా ఇంటర్వ్యూల విషయంలో.. మొక్కుబడి వ్యవహారంలా తంతు నడిపించేశారు. కేవలం ప్రీ ఆర్గనైజ్డ్ ఇంటర్వ్యూలే బయటకు వచ్చాయి. అంటే.. ఓ యాంకర్ ని పెట్టుకోవడం, కావల్సిన క్వశ్చన్స్‌తో ఇంటర్వ్యూ నడిపించడం, దాన్నే… అన్ని ఛానళ్లకూ పంచి పెట్టడం… ఇలా జరిగిపోయింది. రానా, సందీప్ రెడ్డి వంగా, సుమ, అనిల్ రావిపూడి.. కీరవాణి.. ఇలా ఇంటర్వ్యూ ఎవరు చేయాలి? అనే విషయంలోనూ ఆచి, తూచి వ్యవహరించారు. దాదాపుగా ఆర్.ఆర్.ఆర్ ప్రచారం.. ఈ ప్లానింగ్ తోనే సాగింది.
ఇప్పుడు ఇదే స్ట్రాటజీని.. ఆచార్య కూడా ఫాలో అవుతోందని అనిపిస్తోంది. ఈనెల 29న `ఆచార్య` వస్తోంది. అయితే పబ్లిసిటీ ఇంకా మొదలెట్టలేదు. ఇంకో వారం రోజుల్లో సినిమా ఉందగా.. పబ్లిసిటీ కి పచ్చ జెండా ఊపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈలోగా.. ఓ ప్రీ ఆర్గనైజ్డ్ ఇంటర్వ్యూ వదిలారు. ఇది ఆరంభం మాత్రమే. ఇలాంటి ఆర్గనైజ్డ్ ముఖాముఖిలు. ఇంకొన్ని ఉన్నాయని సమాచారం. ఆర్.ఆర్.ఆర్ విషయంలో మీడియా గుర్రుగా ఉంది. పాన్ ఇండియా సినిమా తీసి, తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని అలిగింది. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఆచార్య కూడా అనుసరిస్తే.. ఇలాంటి విమర్శలు తప్పవు. కాకపోతే… చిరంజీవి ఎప్పుడూ మీడియాకు అందుబాటులోనే ఉండే హీరో. మీడియాతో ఎలా మసులుకోవాలో ఆయనకు బాగా తెలుసు. మరి ఈసారి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.