ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న వ్యథలు పవన్ కల్యాణ్‌ను ఆవేదనకు గురి చేస్తున్నాయి. వారి కోసం రూ. ఐదు కోట్ల సొంత ధనం పార్టీకి విరాళంగా ఇచ్చి.. ఆ కుటుంబాలను ఆదుకునేందుకు రైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన ఈ సారి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ నెల ఇరవై మూడో తేదీన ఆయన ఆ జిల్లా పర్యటనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేయనున్నారు.
ప్రతీ రోజూ దినపత్రికల్లో పెద్ద ఎత్తున రైతుల ఆత్మహత్యల వార్తలు రావడం పవన్ కల్యాణ్‌ను కలచి వేస్తోంది. బురద చల్లే రాజకీయాలు తమకు చేత కావని రైతులను ఆదుకోవాలని ఆయన ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుల పాలై.. ప్రభుత్వ సాయం అందక…వందల మంది కౌలు రైతులు మరణిస్తున్నారని.. అన్నదాతకు ఇలాంటి దుస్థితి రాకూడదంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను గుర్తించడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడటం లేదు. గుర్తించినా అరకొరగా సాయం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాకు పవన్ కల్యాణ్ వెళ్తున్నారు.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు అని తెలిసిన తర్వాత ప్రభుత్వ ఆయా రైతుల కుటుంబాల అకౌంట్లలో పరిహారం జమ చేసింది. కానీ ఇతరులెవ్వరికీ ఇవ్వలేదు. ఇలాంటి ప్రభుత్వ వైఖరి మరింత ప్రమాదకరమన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని కదిలించేంత వరకూ తాను రైతు భరోసా యాత్ర చేస్తానని పవన్ కల్యాణ్ చెబుతున్నారు.