తెలుగుదేశం పార్టీలో పని దొంగల్ని గుర్తించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు . ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. పార్టీ నేతలు చాలా మంది ప్రజల్లో పని చేయకండా టీడీపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని అలాంటివారి వల్ల పార్టీకి లాభం లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతల పనితీరును ఎరప్పటికప్పుడు మదింపు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ తెచ్చామని పని చేసే వారికే గుర్తింపు ఉంటుందన్నారు పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన తర్వాత మాట్లాడిన చంద్రబాబు పార్టీ నేతలకు సూటిగా.. సుత్తి లేకుండా చెప్పాలనుకున్నది చెప్పారు.
సీనియర్ నేతలకు ఎల్లప్పుడూ గౌరవంఉంటుందని కానీ ఓట్లు వేయించలేని స్థితికి సీనియర్ నేతలు వెళ్తే వారికి సీట్లివ్వడం సాధ్యం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో నలబై శాతం సీట్లు యువతకే ఇవ్వాలని నియమం పెట్టుకున్నామని… పార్టీ నేతల వారసులేక కాదు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే తటస్థ యువతకు కూడా సీట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పార్టీలో పని చేసే యువ నేతల్ని గుర్తిస్తామని ప్రకటించారు.
యువతకు ఎక్కువ అవకాశాలిచ్చే క్రమంలో ఈ సారి కొత్త తరాన్ని తెరపైకి తేవాలని వారు వారసులే కాకుండా బయట నుంచి పోరాడే వారికి కూడా అవకాశం ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇతర రంగాల్లో పేరు ప్రఖ్యాతలు పొందిన కొంత మంది యువ నేతల్ని త్వరలో టీడీపీలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చంద్రబాబు ప్రత్యేకవ్యూహంతోనే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.