” రెస్పాన్సిబుల్ పాలసీ మేకర్స్ డు నాట్ టేక్ ఇర్రెస్పాన్సిబుల్ డెసిషన్స్ ” .. బాధ్యత ఉన్న చట్టాలు చేసే వారు ఎవరూ పనికి మాలిన నిర్ణయాలు తీసుకోరు. ఆ పనికి మాలిన నిర్ణయాలు అని తెలిసి కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటున్నారంటే బాధ్యత లేదని అర్థం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌తో అమలు చేయాలనుకుంటున్న బియ్యానికి బదులు నగదు పథకం గురించి కాస్త లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. రెండేళ్ల కిందట చెన్నైలో భీకరమైన వరదలు వచ్చాయి. ఆ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. బయట ఏమీ దొరకని పరిస్థితి. ఆ సిట్యూయేషన్లో ఇరుక్కుపోయిన ఓ వ్యక్తి తన అనుభవాన్ని ఇలా రాసుకున్నాడు ” నా దగ్గర డెబిట్ కార్డులున్నాయి.. క్రెడిట్ కార్డులున్నాయి. వాటిలో నాలుగైదు లక్షల లిమిట్ ఉంది. చేతిలో క్యాష్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే నేను ధనవంతుడ్నే. కానీ ఆకలి వేస్తోంది.. ఏమైనా కొందామంటే.. డబ్బులు ఇచ్చినా ఇవ్వడానికి ఎవరూ లేరు. అప్పుడు నాకు అనిపించింది ఈ డబ్బులు కాదు.. ఆకలి తీర్చే వస్తువులే ముఖ్యం ” అని. డబ్బు పెడితే ఏమైనా వస్తుందని అనుకునేవారు.. డబ్బుతోనే అన్నీ రావని జీవితంలో ఎప్పుడో ఓ తెలుస్తుంది. కానీ అప్పటికే చేతులు కాలకపోతే అదృష్టవంతులు. వెనిజులా నుంచి సోమాలియా వరకూ మనకు అనేకానేక అనుభవాలు ఉన్నాయి. తాజాగా శ్రీలంక కూడా కనిపిస్తోంది. డబ్బులు కట్టలు కట్టలు ఇస్తాం కానీ.. ఓ బస్తా బియ్యం ఇవ్వండయ్యా అని ప్రజలు బతిమాలుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ? ఇది అర్థం చేసుకోవడానికి అమర్త్య సేన్ రాసిన ఎకనామిక్స్ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మనం ప్రింట్ చేసుకునే డబ్బులుంటే అన్నీ వస్తాయని అనుకోవడం వల్లే ఇదంతా జరుగుతోంది. ఈ సూక్ష్మం తెలిసిన పాలకులు కూడా డబ్బుల వెంట పడుతున్నారు. ప్రజల్ని ఆకలి మంటల్లోకి నెడుతున్నారు. దానికి సాక్ష్యమే… బియ్యానికి నగదు బదిలీ పథకం.
రేషన్ కార్డుల లక్ష్యం ఏమిటో పాలకులకు గుర్తుందా!?
దేశంలో తిండికి అలమటించే వారి ఆకలి తీర్చడానికి పెట్టిన పథకం రేషన్. వారు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయలేరని ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ రేషన్ తీసుకోవద్దు మీకు డబ్బులిస్తాం అంటున్నాయి. బియ్యానికి బదులుగా కేజీకి రూ.15 లేదా ఇరవై చొప్పున నగదు చెల్లిస్తే, ప్రజలు వాటిని సులువుగా ఖర్చు చేసేస్తారు. వారికి తినడానికి బియ్యం ఉండవు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారులు బియ్యం ధరలను కార్పొరేట్లు ఇష్టానుసారం పెంచుకునే వీలు కలుగుతుంది. తినాలంటే ఖచ్చితంగా వారు పెట్టిన ధరకే బియ్యం కొనుగోలు చేయాలి. వారికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది ? నిరుపేదలు సులువుగా డబ్బులకు ఆశ పడతారు. బియ్యానికి బదులు డబ్బులు ఇస్తే తీసుకుంటారు. కాన తిండి తిప్పల సంగతెవరు చూస్తారు ? వారు ఆకలి చావులకు ఎవరిది బాధ్యత ?
నిరుపేదల ఆకలి కేకల పథకం అది !
బియ్యం బదులు నగదు ఇచ్చే కార్యక్రమంతో భవిష్యత్తులో ఆహార కొరత, పౌష్టికాహార లోపం తాండవం చేసే ప్రమాదం ఉంది. బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇవ్వాలని నిర్ణయించిదంది. ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి విధానాన్ని తెరమీదకు తెచ్చిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దురుద్దేశంతో బియ్యం ఇవ్వకుండా నగదు బదిలీ చేయాలని వివిధ రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేస్తోంది. నాణ్యతలేని బియ్యం ఇస్తే, ప్రజలు తప్పకుండా నగదు తీసుకుంటారనే ఆలోచనతో నాశిరకం బియ్యాన్ని కేంద్రం రాష్ట్రాలకు పంపుతోందన్న విమర్శలు ఉన్నాయి. కార్డుదారులు అంగీకరిస్తే.. లక్షల కుటుంబాల ఆహార భద్రత ప్రశ్నార్థకం అవుతుంది.. రేషన్ బియ్యం పక్కదారి పట్టకూడదని, రీసైక్లింగ్‌కు అవకాశం ఇవ్వకూడదనే నగదు బదిలీ అమలు చేస్తామని, అదీ వినియోగదారులు కోరుకుంటేనే అమలుచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనివల్ల బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగే ప్రమాదమూ ఉంది. ఒక నెల చౌక బియ్యం అందకపోతే పూట గడవని కుటుంబాలు రాష్ట్రంలో లక్షల్లో ఉన్నాయి. నగదు బదిలీకి అంగీకరిస్తే.. ఈ కుటుంబాలపై ప్రతి నెలా ఆర్థిక భారం పెరుగుతుంది.
భారం తగ్గించుకునే ప్రయత్నాల్లో ఏపీ ప్రభుత్వం !
జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం తన వద్ద ఉన్న 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎపికి కేవలం 90 లక్షల కార్డుల కింద ఉన్న 2,42,99,920 మందికి రేషన్ లేదా దానికి సరిపడా నగదును కేజీకి రూ.36 చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద కూడా కేంద్రం కేవలం ఈ 90 లక్షల కార్డులకే బియ్యం తాలూకా చెల్లింపులు చేస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 56,06,681 కార్డుల కింద ఉన్న 1,55,68,927 మందికి బియ్యం ఇవ్వలేక, ఆర్థికభారంతో విలవిల్లాడుతోంది. మిగిలిన వారికి కూడా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చాలా సార్లు కేంద్రాన్ని కోరింది. ఎన్ఎఫ్ఎస్ఎ కోటా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినవ కార్డు 56,06,681 ఉన్నాయి. వాటి కింద 1,55,68,927 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ కార్డులన్నిటికీ నెలకు 7.78 కోట్లు కేజీల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కేజీకి రూ.36 చొప్పున ప్రభుత్వం నెలకు రూ.280 కోట్లు, సంవత్సరానికి రూ.3,362.88 కోట్లు ఖర్చు పెడుతోంది. దీంతోపాటు బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ డెలివరీ యూనిట్ లు 9,260 నిర్వహిస్తోంది. దీనికి నెలకు ఒక్కో డ్రైవర్‌కు రూ.18 వేలు చొప్పున రూ.16.66 కోట్లు, ఏడాదికి రూ.200 కోట్లు భారం పడుతోంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం నాన్ ఎన్‌ఎస్‌ఎఫ్‌ఎ కార్డులకు రేషన్ బియ్యం ఇచ్చేందుకు ఏడాదికి రూ.3,562.90 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీని నుంచి తప్పించుకునేందుకు నాన్ ఎన్‌ఎస్‌ఎఫ్‌ఎ కార్డులకు నగదు బదిలీ చేయాలని భావిస్తోంది. బియ్యం వద్దనుకునే వారికి కేజీ బియ్యానికి రూ.15 ఇస్తామని చెబుతోంది. దీని పైలెట్ ప్రాజెక్టును రాష్ట్రంలో 5 మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్నారు. తర్వాత రాష్ట్రం మొత్తం ్మలు చేస్తారు.
బియ్యం వద్దనుకునే వారికి కార్డు అర్హత ఉంటుందా ?
అసలు పథకం లక్ష్యం బియ్యం కొనుగోలు చేయలేని వారి కడుపు నింపడం. అలాంటప్పుడు బియ్యం వద్దనుకునేవారికి కార్డుకు అర్హత ఉంటుందా అనేది సహజంగా వచ్చే సందేహం. మెల్లగా ఇలాంటి వారికి కార్డులను కట్ చేసే అవకాశం ఉంది. పేదలకు డబ్బులకు ఆశపడితే మొదటికే మోసం రావొచ్చు. ఒకప్పుడు గ్యాస్ సబ్సిడీని కేంద్రమే భరించేది. ఎంత భరిస్తారనేది జనానికి తెలిసేది కాదు. కానీ తర్వాత కొనుగోలుదారే కట్టుకోవాలి.. నగదు బదిలీ చేస్తామన్నారు. అప్పట్లో 400 రూపాయలకు అటూ ఇటుగా ఉండే గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు వెయ్యి దాటిపోయింది. కానీ వచ్చే సబ్సిడీ మాత్రం రూ. 40 మాత్రమే. అదే విధంగా బియ్యానికి నగదు బదిలీ కూడా భారం తగ్గించుకునేందుకేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేదవాడి కడుపు నింపే ఈ పథకాన్ని కూడా నియంత్రించి నిధులు మిగుల్చుకోవాలనుకోవడం అవివేకం. బాధ్యత లేని పాలకుల నిర్ణయం.
భారం తగ్గించుకోవడానికి అనర్హుల్ని ఏరి వేయవచ్చు కదా !
ఏపీలో నాలుగున్నర కోట్ల మంది జనాభా ఉంటే.. నాలుగు కోట్ల మందికి రేషన్ పంపిణీ చేస్తున్నట్లుగా లెక్కలు ఉన్నాయి. కానీ నిజంగా అంత మందికి రేషన్ అందుతుందా.. అంత మంది పేదలు ఉన్నారా అంటే చెప్పడం కష్టం. కుటుంబాల కన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఉన్న పరిస్థితి. రేషన్ కార్డు దారుల్లో కనీసం అరవై శాతం మంది అనర్హులు ఉంటారని అంచనా. వీరందర్నీ ఏరివేసి.. అసలైన అర్హులకు ఆ ఫలాలను పంపిణీ చేస్తే నిజమైన పేదలకు లాభం కలుగుతుంది. కానీ.. ప్రభుత్వాలు ఎంత టెక్నాలజీ పెంచుకున్నా.. ఆధార్ లాంటి వ్యవస్థల్ని ఏర్పాటుచేసుకున్నా… పథకాల్లో జరుగుతున్న అవినీతిని మాత్రం అంతమొందిచలేపోతున్నాయి. దీనికి కారణం రాజకీయ అవినీతే. రేషన్ కార్డులు తీసేస్తే తమ ఓట్లకు ఎక్కడ గండి పడతాయోనని వారి ఆందోళన. వారి ఓటు బ్యాంకులకు నష్టం కలగకుండా చేసుకోవడానికి.. తమపై భారం తగ్గించుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల పొట్టకొట్టడానికి సిద్ధమవుతోంది.
బియ్యమే కొంటారన్న గ్యారంటీ ఏముంది ?
నగదు బదిలీ ద్వారా ప్రభుత్వం కార్డుదారుల ఖాతాల్లో నగదు వేస్తుంది. వీటిని బ్యాంకు నుంచి తీసుకున్నాక.. బియ్యమే కొనుక్కుంటారని చెప్పలేం. ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చు. కొందరు మద్యం తలుపు తట్టవచ్చు. దీంతో ఆయా కుటుంబాలు పస్తులతో గడపాల్సిన పరిస్థితికి దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాపంపిణీ ద్వారా.. ప్రభుత్వం ఏడాదికి 28 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంది. అందుకే బహిరంగ మార్కెట్లో ధరలు పెరగడం లేదు. నగదు బదిలీ అమలు చేస్తే ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం తగ్గిపోతుంది. ఇదే అదనుగా వ్యాపారులు బియ్యం ధరలు పెంచే అవకాశం ఉంది. గతంలో నగదు బదిలీ అమలుచేసిన రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తలెత్తింది. మన రాష్ట్రంలోనూ అదే జరిగితే.. కార్డుదారులకు బియ్యం మరింత భారం అవుతాయి. అంతిమంగా అది మధ్యతగతి జీవుల్ని కూడా ఆకలి చావులకు గురి చేసే ప్రమాదం ఉంది.
ప్రభుత్వాలు ఇప్పటికైనా భారం తగ్గించుకునే ఆలోచనలలను కాస్త తెలివిగా మార్చుకోవాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కన పెట్టి నిజమైన రాజనీతి చేయాలి. ఎవరికైతే అవసరమో వారికి మాత్రమే పథకాలు అమలు చేయాలి. లేకపోతే.. మొదటికే మోసం వస్తుంది. ఇలా చేయడం… అధికారం ఇచ్చిన ప్రజల్ని వంచించిడమే. తమ స్వార్థం కోసం ప్రజల్ని ఆకలి చావులకు గురి చేయడమే. కానీ మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారు ? అంతకు మించి మన జనం ఎప్పుడు అవగాహన పెంచుకుంటారు ?