ఖమ్మం జిల్లాకు మంత్రిగా అవకాశం ఇస్తే.. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కుట్టిపెట్టినట్లుగా టీఆర్ఎస్కు నెగెటివ్ తీసుకొచ్చిపెట్టిన మంత్రి పువ్వాడ అజయ్ ఇప్పుడు కులం వాదన నెత్తికెత్తుకున్నారు. తాను కమ్మ కులం వాడినని… అందుకే విమర్శలు చేస్తున్నారని.. తన మంత్రి పదవిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని వాదన ప్రారంభించారు. ఏపీలో కొడాలి నాని మంత్రి పదవిని కూడా పీకేశారని.. తెలుగు రాష్ట్రాల్లో కమ్మ మంత్రిని తానొక్కడినేనని… అందరూ ఐక్యంగా ఉండాలని కమ్మ వారికి చెప్పుకుంటున్నారు.
నిజానికి ఖమ్మంలో పువ్వాడ అజయ్ వ్యవహారశైలిపై ఎవరూ సంతృప్తిగా లేరు. ఏపీలో వైసీపీ అరాచకాన్ని ఆదర్శంగా తీసుకుని ఇష్టారీతిన అందరిపై కేసులు పెట్టి వేధించారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా పోస్టులపైనా కేసులు పెట్టి పోలీసులతో కొట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. బీ జేపీ కార్యకర్త సాయిగణేష్‌ను అలాగే వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనాత్మకం అయింది. ఈ విషయంలో పువ్వాడ అజయ్‌ను టీఆర్ఎస్ నేతలు కూడా సమర్థించడం లేదు.
ఖమ్మంలో పువ్వాడ మంత్రి కాక ముందే కమ్మ సామాజికవర్గం నుంచి బడా బడా నేతలున్నారు. వారెవరూ… రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు తాను కమ్మ అని.. తొక్కేస్తున్నారని ఏడవలేదు. కానీ పువ్వాడ మాత్రం అదే్ ప్రయోగిస్తున్నారు. గొప్ప కమ్యూనిస్టు లీడర్లలో ఒకరైన పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడైన అజయ్.. ఇప్పుడు తన రాజకీయ ఇబ్బందుల్లో కులాన్ని అడ్డం పెట్టుకోవడంతో ఆయన ఇమేజ్ మరింత దిగజారినట్లయింది.