టాలీవుడ్లోని బెస్ట్ డాన్సర్లలో… రామ్ ఒకడు. సరైన పాట కుదరాలే గానీ, మెమెంట్లతో అదరగొట్టేస్తాడు. `ది వారియర్`లో రామ్ కి అలాంటి పాటొకటి పడింది. అదే.. `బుల్లెట్` పాట. లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే… తమిళ స్టార్ శింబు ఆలపించాడు. దాంతో.. ఈ పాటకు క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు బుల్లెట్ పాటని విడుదల చేసింది చిత్రబృందం.
శ్రీమణి రాసిన సరదా గీతమిది. బుల్లెట్టు, డ్యూయెట్లు, ఆమ్లెట్లూ, రెడ్ లైటూ అంటూ.. ప్రాసలు వరుస కట్టించారు. అయితే వినడానికీ, పాడుకోవడానికీ బాగుంది. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అదిరిపోయినట్టే కనిపిస్తోంది. రామ్ తో చాలా స్టైలీష్ సిగ్నేచర్ స్టెప్పులు వేయించారు శేఖర్. సెట్లూ, కాస్ట్యూమ్స్ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా… కృతి శెట్టి మాస్ మాస్ గా స్టెప్పులు వేసింది. రామ్ తో పోటీ పడి కృతి స్టెప్పులు వేయడం విశేషం. కొన్నాళ్ల పాటు.. ఈ పాట హల్ చల్ చేయడం ఖాయం. రామ్ స్టెప్పులు ఎలాగూ అదిరిపోయాయి కాబట్టి.. థియేటర్లో ఈ పాట కేకలు పుట్టిస్తుందనే అనిపిస్తోంది.