రేషన్ బియ్యానికి నగదు బదిలీ వెనుక పెద్ద స్కాం ఉందన్న ఆరోపణలు రావడం… రేషన్ కార్డు దారులు కూడా తమకు బియ్యమే కావాలని ఎక్కువ మంది పట్టుబడుతూండటంతో చివరికి ప్రభుత్వం.. రేషన్ కు నగదు బదిలీ పథకాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. యాప్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో వాయిదా వేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే యాప్ సమస్యతో ఏకంగా పథకాన్నే ఆపేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. కేజీకి ఎంత ధర ఇవ్వాలన్నది ఇంకా ప్రభుత్వమే నిర్ణయించుకోలేకపోతోంది.
పది నుంచి పదిహేను రూపాయలు ఇస్తే ప్రజలు ఆగ్రహిస్తారు. అదే సమయంలో తమకు రేషన్ బియ్యం బదులు డబ్బులు ఇస్తే తర్వాత కార్డు తీసేస్తారని ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ… పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయాలనుకున్న ఐదు మున్సిపాల్టీల్లో వాలంటర్లను పంపి అంగీకారపత్రాలు తీసుకుననారు. వంద శాతం తీసుకోవాలని అధికారులు వాలంటీర్లను ఆదేశిస్తున్న ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. కేజీ బియ్యానికి ఎంత చెల్లించాలన్నదానిపై స్పష్టత రాకపోవడం.. ఎక్కువ మంది లబ్దిదారులు బియ్యం తీసుకోవడానికే ఆసక్తి చూపడంతో తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అసలు బియ్యం కూడా కొనుగోలు చేసుకోలేని వారి కోసమే రేషన్ కార్డుల పథకం ఉందని ఇప్పుడు వారే బియ్యం వద్దంటే…వారికి బియ్యం కొనుగోలు చేసే స్థోమత ఉందనే కదాఅర్థం అని అంటున్నారు. ఈ కారణంగా కార్డులు తీసివేస్తారన్న ప్రచారం జరగడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. మళ్లీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పలేదు.