ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రామ సచివాలయాల వ్యవస్థను తమ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ ప్రకటించారు. గ్రామ సచివాలయాల ఏర్పాటును విడతల వారిగా చేపట్టనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. వీటిలో 600 ఈ ఏడాదికి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో సీఎం స్టాలిన్ వెల్లడించారు. గ్రామ సచివాలయాలను మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తాం. ఇందులో సమావేశ మందిరంతో సహా అన్ని సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. ఒక్కొక్కటి రూ. 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తాంమన్నారు.
నవంబర్ 1వ తేదీని “స్థానిక పాలనా దినోత్సవం”గా జరుపుతాం. ఏడాదికి గ్రామసభలు నిర్వహించే సమావేశాలను 4 నుంచి 6కు పెంచుతాం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థ అమలులో ఉంది. దేశంలోనే మొదటిసారిగా గ్రామ సచివాలయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి, తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ అదే ఏడాది అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడానికి ప్రయత్నిస్తోంది. 700 వందలకుపైగా సేవలను అందిస్తోంది.
అయితే స్టాలిన్ పంచాయతీలకు సమాంతరంగా వీటిని ఏర్పాటు చేస్తూ కొత్తగా ఉద్యోగుల్ని నియమించే ప్రయత్నం చేయడం లేదు. పంచాయతీల ఆధ్వర్యంలోనే పంచాయతీ ఉద్యోగులతోనే నిర్వహించనున్నారు.