మహారాష్ట్రలో థాకరేలంటే అందరికీ దడే. బాల్ ధాకరే వారసత్వం అంది పుచ్చుకుని రాజకీయాల్లో ఆయన వారసుడు ప్రస్తుత సీఎం ఉద్దవ్ ధాకరే దూకుడుగా ఉంటారు. శివసైనికులంటే విధ్వంసానికి మారు పేరు. ఇప్పుడు వారినే సవాల్ చేస్తున్నారు నవనీత్ కౌర్. తెలుగు సినిమాల్లో గ్లామర్ హీరోయిన్గా కనిపించి ఉండవచ్చు కానీ.. ఆమె మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన ఎంపీ. అన్ని విషయాలపై సమగ్రమైన అవగాహనతో ఆమె ఉజ్వల భవిష్యత్ ఉన్న యువనేతగా పేరు తెచ్చుకుంటున్నారు.
ఇప్పుడు నేరుగా హిందూత్వ రాజకీయాలతో ఎదిగిన శివసేనకు అదే హిందూత్వంతో చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ధాకరేను హనుమాన్ చాలీసా చదవాలని సవాల్ చేశారు. ఆయన స్పందించకపోవడంతో తానే ఆయన ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతానని సవాల్ చేశారు. దానికి శనివారమే ముహుర్తం పెట్టడంతో రచ్చ రచ్చ అయిపోయింది. ముంబైలోని కౌర్ ఇంటి పై శివసైనికులు దండెత్తారు. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన కేంద్రం వై కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది.
నవనీత్ కౌర్ భర్త రవి రానా కూడా ఎమ్మెల్యేనే. ఆయనతో కలిసి హనుమాన్ చాలీసా పఠించేందుకు వెళ్లక ముందే శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ముంబైలోని వారింటిముందు ఆందోళనకు దిగారు. రానా దంపతులకు అధికార శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివసేనను సవాల్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మహారాష్ట్రలో మీరు ప్రశాంతంగా గడపలేరంటూ హెచ్చరిస్తున్నారు. అయితే ననవీత్ కౌర్ వాటన్నింటినీ లెక్క చేయనంత ఫైర్ బ్రాండ్‌గా మారిపోయారు. ధాకరేలకే దడ పుట్టిస్తున్నారు.