కౌలు రైతుల సమస్యలు వైసీపీ సృష్టించినవి కావని.. కానీ అధికారంలో ఉండి పట్టించుకోకపోవడం వల్ల వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి బాద్యత సీఎం జగన్ దేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పశ్చిగోదావరి జిల్లాలో ఆయన రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఓదార్చి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ప్రజల కన్నీళ్లు తుడవకపోతే జగన్ను గట్టిగా అడుగుతాం !
కౌలు రైతులకు అండగా ఉంటే నేను రోడ్డు మీదకు రావాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. ఇంత మెజారిటీ ఇచ్చిన ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందిని గుర్తు చేశారు. రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానం.. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కన్నీళ్లు తుడవకపోతే గ్రామాల్లో గ్రామ సచివాలయాలు ఎందుకని ప్రశ్నించారు. జనసేన ఎత్తుకుంటే తప్ప మీకు సమస్య గుర్తుకురాలేదా అని హడావుడిగా కొన్ని కుటుంబాలకు ఇస్తున్న పరిహారం గురించి ప్రస్తావించారు. జల కన్నీళ్లు తుడుస్తామని చెప్పిన జగన్ అలా చేయకపోతే మాత్రం గట్టిగా అడుగుతామని తేల్చి చెప్పారు. ఒకసారి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబసభ్యులతో మాట్లాడండి. అసలు సమస్య ఏంటో తెలుస్తది. అధికారం మీ చేతుల్లో ఉంది. మీరే పట్టించుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు.
యువతే బాధ్యత తీసుకోవాలి !
తన సభకు అత్యధికంగా యువత తరలి రావడంతో వారికి ప్రత్యేకంగా పవన్ విజ్ఞప్తి చేశారు. నాపై వ్యక్తిగత ఇష్టం ఉన్నప్పటికీ రాజకీయంగా జగన్కు ఓటేశారని.. తాను స్వాగతిస్తానన్నారు. తాను ఒక్కొక్క మెట్టు ఎక్కాలనుకునేవాడినని. రాత్రికి రాత్రి ఎక్కడికో వెళ్లాలనుకోవడం లేదన్నారు. వైసీపీ పాలన ఘోరంగా ఉందని.. దీన్ని మార్చే శక్తి కేవలం యువతకు మాత్రమే ఉందన్నారు. మీరు బాధ్యత తీసుకోకపోతే ఈ సమాజంలో మార్పు రాదని యువతకు సూచించారు.
నర్సాపురం ఎంపీ సలహాలిస్తున్నారు !
సభలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం పర్యటన తర్వాత నర్సాపురం ఎంపీ రఘురామ తనకు ఫోన్ చేశారన్నారు. కొన్ని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని చెప్పారన్నారు. వారి సూచన మేరకు నేను సరిదిద్దకుంటానని పవన్ స్పష్టం చేశారు. పోయినసారి చర్లపల్లి షటిల్ టీం అని అన్నాను. అది చర్లపల్లి కాదు.. చంచల్గూడ షటిల్ టీం అని చెప్పారు. చంచల్గూడలో షటిల్ ఆడుతూ మీరు నాకు చెబుతున్నారా? అని ప్రశ్నించారు. ఇంకోసారి దత్తపుత్రుడు అంటే.. సీఎం అనే గౌరవం కూడా ఇవ్వబోమన్నారు. కష్టాల్లో ఉన్నవారంతా సొంతవాళ్లేనని ఎవరికీ దత్తతగా వెళ్లనన్నారు. నన్ను దత్తత తీసుకుంటే ఎవరూ భరించలేరని హెచ్చరించారు.