మిర్చి, జనతా గ్యారేజీ, శ్రీమంతుడు, భరత్ అనే నేను… కొరటాల దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవి. వీటన్నింటికీ.. దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడు. అన్నీ మ్యూజికల్ హిట్సే. ఇప్పుడు ఆచార్యకు మాత్రం మణిశర్మని తీసుకొన్నాడు కొరటాల. తన కెరీర్లో దేవి కాకుండా మరో సంగీత దర్శకుడిగా పనిచేయడం ఇదే తొలిసారి. పాటలు.. ఓకే అనిపించుకున్నాయి. అయితే.. ఆర్.ఆర్ విషయంలో మణిశర్మ మార్క్ వేరే. ఆయన సినిమాని తన ఆర్.ఆర్తో పరుగులు పెట్టించేస్తారు. ఆచార్య లాంటి కథకు పాటల కంటే ఆర్.ఆర్కే ప్రాధాన్యం ఎక్కువని భావించిన కొరటాల… మణిశర్మని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. పైగా చిరు – మణిశర్మ కాంబో అంటే సూపర్ హిట్ అనే గ్యారెంటీ ఉంది.
అయితే… ఆర్.ఆర్ విషయంలో.. కొరటాలని మణి బాగా విసిగించేసినట్టు సమాచారం. మణి ఇచ్చిన అవుట్ పుట్ కొరటాలకు నచ్చకపోవడం, ఆయన `ఇంకోటి చేయండి` అని అడగడం, మణి మళ్లీ చేయడం.. అదీ నచ్చకపోవడం.. ఇదే తంతు. ఆచార్య సినిమా పూర్తయి చాలా కాలమైంది. ఆర్.ఆర్ చేయడానికి కావల్సినంత సమయం దక్కింది. అయినా సరే, అవుట్‌పుట్ పై కొరటాల ఏమాత్రం సంతృప్తిగా లేడని తెలుస్తోంది. చివర్లో కొన్ని ట్రాకులు మణిశర్మ తనయుడు మహతి సాగర్ తో కొట్టించినట్టు సమాచారం అందుతోంది. యూఎస్‌కి ప్రింట్లు పంపించే చివరి నిమిషం వరకూ.. ఆర్.ఆర్ విషయంలో కొరటాల టెన్షన్ పడుతూనే ఉన్నాడని, వ్యవహారం చూస్తుంటే.. భవిష్యత్తులో మణిశర్మతో మళ్లీ పని చేయకూడదని గట్టిగా ఫిక్సయిట్టే ఉంది.