అనుకున్నదే జరిగింది. `ఆచార్య`లో కాజల్ పాత్రని పూర్తిగా లేపేశారు. ఆమె ఆచార్యలో కనిపించదు. ఈ విషయాన్ని కొరటాల శివ చెప్పేశారు. ఆచార్యలో ఇద్దరు హీరోయిన్లు.. ఒకరు కాజల్, మరొకరు పూజా హెగ్డే. కాజల్ పూర్తి స్థాయి హీరోయిన్ అని, పూజాది గెస్ట్ తరహా పాత్ర అని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు కాజల్ లేదు. పూజానే మెయిన్ హీరోయిన్ అయిపోయింది. ఆచార్య టీజర్లో గానీ, ట్రైలర్లో గానీ కాజల్ కనిపించలేదు. చిరు – కాజల్ మధ్య పాట అనే ఊసేలేదు. అప్పటి నుంచీ అసలు ఈ సినిమాలో కాజల్ ఉందా, లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వీటిపై కొరటాల క్లారిటి ఇచ్చేశారు.
నిజానికి ఇలాంటి కథలో.. హీరోయిన్ పాత్ర అవసరమే ఉండదని, కానీ కమర్షియల్ సినిమా లెక్కల్లో కాజల్ ని తీసుకొన్నామని, నాలుగైదు రోజులు షూట్ కూడా చేశామని, అయితే.. ఏమాత్రం ప్రాధాన్యం లేని ఓ పాత్రలో కాజల్ లాంటి స్టార్‌ని చూపించడం బాగోదన్న ఉద్దేశ్యంతో.. చిరుతో మాట్లాడి, ఆ పాత్రని పూర్తిగా ఎత్తేశామని…కొరటాల క్లారిటీ ఇచ్చారు. ఆచార్య ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన `లాహే.. లాహే` పాటలో కాజల్ కనిపించింది. నాలుగు స్టెప్పులు కూడా వేసింది. ఇప్పుడు ఆ షాట్లూ థియేటర్లో కనిపించవు. అలా.. కాజల్ ఈ సినిమాలోకి వచ్చి మాయమైపోయింది.
కథ రాసుకున్నప్పుడే కాజల్ పాత్రకు ప్రాధాన్యం లేదని తెలుసు. అయినా తనని తీసుకొచ్చారు. కథలో ఇమడలేదని కట్ చేశారు. దీనివల్ల సినిమాకి మైనస్సో.. ప్లస్సో ఇప్పుడే చెప్పలేం. కానీ కాజల్ లాంటి స్టార్‌ని తీసుకొచ్చి.. ఆ పాత్రని పూర్తిగా లేపేయడం మాత్రం కాజల్ కెరీర్లో ఓ చిన్న మచ్చలా మిగిలిపోతుంది. పాపం.. కాజల్. ఆచార్య విషయంలో తనకు అన్యాయమే జరిగింది.