విశాఖలో రుషి కొండ అంటే తెలియని వారు ఉండరు. అక్కడ ఉన్న టూరిజం కాటేజీ నుంచి సముద్రాన్ని ఆస్వాదించడం ఓ అద్భుతమైన అనుభవం. అలాగే అలల దగ్గర నిలబడి రుషికొండను చూసినా అద్భుతమే. ఇది పర్యాటకులకు స్పెషల్ అట్రాక్షన్. కానీ ఇప్పుడు రుషికొండ ను ఎలాగూ చూడలేరు. ఎందుకంటే కొండ చుట్టూ తవ్వేశారు. ఒక్క పైభాగం మాత్రం ఉంది. దాన్ని కూడా ఉంచుతారా తీసేస్తారా అన్నది ఎవరికీ తెలియదు. ఎందుకంటే అసలు ఆ రుషికొండపై ఉన్న టూరిజం కాటేజీలని ఎందుకు తొలగించారో.. అక్కడ ఏం కడుతున్నారో అధికారికంగా ఎవరికీ తెలియదు. అంతా గూడుపుఠాణి నడుస్తోంది.
సీఆర్జెడ్ అనుమతులు తెచ్చుకున్నామని చెబుతున్నారు కానీ.. నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చినదానికి తవ్వేసినదానికి అసలు పొంతన లేదు. కొండ ప్రాంతం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి. మరో వైపు రుషికొండను తొలిచి అదంతా.. సముద్ర తీరంలో పారబోస్తున్నారు. ఇలా చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమే. కానీ పట్టించుకునేవారు లేరు. ఎన్జీటీకి ఫిర్యాదులు చేసినా ఎవరూ పరిగణనలోకి తీసుకోడం లేదు.
ఇప్పుడు విశాఖకు మణిహారంలో ఉన్న రుషి కొండ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. తీరానికి దూరంగా ఉన్న కొండలపై ఐటీ కంపెనీలు.. హౌసింగ్ ప్రాజెక్టులు కట్టారు కానీ ఇంత విధ్వంసం చేయలేదు. సముద్ర తీరంలో ప్రకితి రక్ష మాదిరిగా ఉన్న కొండను మాత్రం నామరూపాల్లేకుండా తవ్వేస్తున్నారు. ఏ మాత్రం బాధ్యత లేని పాలకులు అని సామాన్య జనం అనుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.