ప్రజల సమస్యలను ప్రభుత్వం ఆలకించడం లేదని.. వారి సమస్యలను తానే వింటానని ప్రజాదర్భార్లు నిర్వహించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. ప్రజల మేలు కోసమే రాజ్‌భవన్ ఉందని తమిళిసై… ప్రజాసమస్యల పరిష్కారానికి ముందడుగు వేస్తామని ప్రకటించారు. మే నుంచి ప్రజాదర్బారు నడుస్తుందని ప్రకటించాు. అందులో వచ్చిన ప్రజాసమస్యలు ప్రభుత్వానికి నివేదించడం తప్పుకాదన్నారు. ఉగాది వేడుకల సందర్భంగా తమిళిశై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాజ్‌భవన్ దగ్గర ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు గవర్నర్ కార్యాలయం చేసింది.
అయితే మే రాక ముందే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. గవర్నర్ ప్రజాదర్భార్లు పెట్టక ముందే ఆ తరహాలో తామే సమస్యలు వినాలని నిర్ణయించుకుంది. జిల్లాల్లో ప్రతీ సోమవారం ప్రజావాణి-గ్రీవెన్స్ డే తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. నిజానికి అంతకు ముందు గ్రీవెన్స్ డే ఉండేది. కానీ గ్రీవెన్స్ డే రెండేళ్లుగా ఆగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తూ రాజ్ భవన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. గవర్నర్ ప్రజాదర్భార్లు నిర్వహించి.. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ప్రభుత్వం భావించినట్లుగా కనిపిస్తోంది.
ప్రభుత్వమే గ్రీవెన్స్ డేను నిర్వహించాలని నిర్ణయించడంతో మే నుంచి గవర్నర్ నిర్వహించాలనుకుంటున్న ప్రజాదర్భార్లు నిర్వహిస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వ గ్రీవెన్స్‌కు రాజ్ భవన్ ప్రజాదర్భార్‌కు సంబంధం లేదని.. గవర్నర్ తాను నిర్వహించాలనుకున్న కార్యక్రమాలను నిర్వహిస్తారని భావిస్తున్నారు.