వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ లేదా ఐ ప్యాక్ సేవలు తీసుకోవడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. గత ఎన్నికలకు ముందు ఆ పార్టీ సేవలు తీసుకున్నామని.. ఆ తర్వాత నుంచి సేవలు కొనసాగించడం లేదన్నారు. అయితే పీకేతో జగన్‌కు వ్యక్తిగత స్నేహం ఉందన్నారు. గతంలో ఓ కేబినెట్ భేటీలో పీకే వస్తాడని మంత్రులకు జగన్ చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయినా పీకే ఎందుకు రావడం లేదో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. గత ఎన్నికల తర్వాత పీకే టీంలో చాలా మందికి ప్రభుత్వంలో డిజిటల్ పదవులు ఇచ్చారు. వారంతా ఇప్పుడు వైసీపీతోనే పని చేస్తున్నారు. ఇక పీకే సేవలు అవసరం లేదనుకున్నారేమో స్పష్టత లేదు.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన బ్లూ ప్రింట్లో పలు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు సూచించారు. ఆ బ్లూ ప్రింట్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని సూచించారు. ఆ విషయంపై జాతీయ మీడియాలోనూ విస్తృత ప్రచారం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ హైకమాండ్ మాత్రం స్పందించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ విషయంలో వైఎస్ఆర్సీపీ సానుకూలంగా ఉందన్న అభిప్రాయం ప్రారంభమయింది. వైసీపీ స్పందించకపోవడంతో ఇవి పెరిగిపోతున్నాయని గమనించిన వైఎస్ఆర్సీపీ హైకమాండ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ స్థాయిలో పెట్టుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు మాత్రం… రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ఏ పార్టీకి అయినా మద్దతిస్తామని చెబుతున్నారు. పీకే పని చేయడానికి నిరాకరించాడా లేకపోతే్.. వైసీపీనే వద్దనుకుందా అన్నదానిపై స్పష్టత లేదు. గెలిచే పార్టీలకే పీకే పని చేస్తారన్న ప్రచారం ఉంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తమ పార్టీ గెలుస్తుంది కాబట్టే పని చేసేందుకు పీకే అంగీకారించాడని చెబుతున్నారు. మరి వైసీపీకి ఎందుకు చేయడం లేదో ?