తెలంగాణ రాష్ట్ర సమితి 21 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఇరవై ఒక్క ఏళ్ల కింద జల దృశ్యంలో పిడికెడు మందితో ప్రారంభమైన టీఆర్ఎస్ నేడు తెలంగాణ సాధించిన పార్టీగా చరిత్రలో తిరుగులేని స్థానం సంపాదించుకుంది. తెలంగామ ఏర్పాటు తర్వాత ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మార్చుకున్నామని కేసీఆర్ ప్రకటించి ముందుకెళ్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని ఎన్నికల్లో ఆ పార్టీదే ఆధిపత్యం. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు అనేక సవాళ్లు టీఆర్ఎస్ ముందు ఉన్నాయి.
కేసీఆర్ ఢిల్లీని గురి పెడుతున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానంటున్నారు. ఆయన పూర్తిగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఈ సారి ప్లీనరీలోనూ అదే వాతావరణం కనిపిస్తోంది. మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో కేటీఆర్ కూడా కూడా జాతీయ స్థాయిలో పోటీ చేస్తామని.. సత్తా చాటుతామని.. ఢిల్లీ ప్రభుత్వానికి సోయి వచ్చేలా చేస్తామని చెబుతున్నారు. అంటే టీఆర్ఎస్ నేరుగా ఢిల్లీని గురి పెట్టి.. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ప్లీనరీలో రోడ్ మ్యాప్ ఖరారు చేసుకోబోతున్నారు.
అయితే కేసీఆర్ ఢిల్లీని గురి పెట్టే ముందు గల్లీని దాటాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలు ముందు రానున్నాయి. అసెంబ్లీలోనే గెలిస్తేనే ఢిల్లీ వైపు పెట్టేగురికి బలం ఉంటుంది. లేకపోతే ఉండదు. అయితే గతంలోలా పరిస్థితులు లేవు. కాంగ్రెస్, బీజేపీల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. రెండు సార్ల ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. దాన్ని కేటీఆర్ కూడా అంగీకరిస్తున్నారు. అధిగమిస్తామంటున్నారు. ప్రజలకు చేసిన మేళ్లను కేటీఆర్ ఏకరవు పెడుతున్నారు. రాజకీయ పార్టీల ఓటముల చరిత్ర చూస్తే … అభివృద్ధిని నమ్ముకున్నాం.. .జనానికి మంచి చేశాం అని ప్రజల వద్దకు వెళ్లినోళ్లు ఎవరూ గెలవలేదు.
కేసీఆర్ ఈ సారి తన కంటే పీకేనే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐ ప్యాక్‌తో ఒప్పందం చేసుకుని ఎన్నికలను ఈదాలని అనుకుంటున్నారు. తన సొంత వ్యూహాలపై కేసీఆర్ ఎందుకు నమ్మకం కోల్పోయారో స్పష్టత లేదు కానీ… పీకే టీం టీఆర్ఎస్లోకి చొరబడటం మాత్రం .. కేసీఆర్‌లో ఓటమి భయం పట్టుకుందన్న ప్రచారం జరగడానికి కారణం అవుతోంది. అయితే ఇలాంటివాటనన్నింటినీ అధిగమించి కేసీఆర్ ఎన్నో సార్లు అద్భుతాలు చేశారు. ఈ సారి కూడా అలా చేయాలన్న సంకల్పంతోనే అడుగు ముందుకేస్తున్నారు.