పెట్రో ధరలను తగ్గించలేదని ప్రధాని మోదీ కొన్ని రాష్ట్రాల సీఎంలపై కరోనాపై సమీక్షలో అసహనం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రాలన్నీ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలే. పెట్రో పన్నులు ఎంత భారీగా వస్తున్నా.. వాటిపై రోడ్ సెస్సులు కూడా విధిస్తున్న రాష్ట్రాలు తాము పన్నుల తగ్గించేందుకు సిద్ధం కాలేదు. అందుకే మోదీ ఆయా రాష్ట్రాలపై అసహనం వ్యక్తం చేశారు. తగ్గించాలని అన్నారు. ఆయా రాష్ట్రాలు తగ్గిస్తాయని ఎవరూ అనుకోవడం లేదు. అయితే రాష్ట్రాలను అనే ముందు కేంద్రం ఏం చేసిందనేది పరిశీలిస్తే.. మోదీ తన ఆవేదనను తాము వసూలు చేస్తున్న పన్నుల విషయంలో ఎందుకు పాటించరనేది అందరికీ అనుమానం రావడం సహజమే.
కరోనాకు ముందు అంటే..రెండేళ్ల కిందటి వరకూ పెట్రోల్ ధర రూ. 70 కి అటూ ఇటూగా ఉండేది. రెండేళ్లలో ఇప్పుడు ధర రూ. 120కి చేరింది. అంటే రెండేళ్లలో నూట యాభై రూపాయలకు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయనని కారణాలు చెబుతారు మరి తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదంటే మాత్రం సమాధానం ఉండదు. యూపీఏ అధికారంలో ఉండి.. ఎన్నికలకు వెళ్తున్నప్పుడు పెట్రోల్ బ్యారెల్ ధర 120 డాలర్లు ఉండేది. అప్పుడు పెట్రోల్ ధర రూ. 70 ఉండేది. ఇప్పుడు బ్యారెల్ ధర 120 డాలర్లు లేదు. ఇంకా తక్కువ ఉంది. కానీ పెట్రోల్ ధర మాత్రం రూ. 120కి చేరింది. ఎలా చేరింది ?
కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్‌ను అమాంతం పెంచేసింది. వరుసగా పెంచుకుంటూ పోయింది. ఒక్క లీటర్ పెట్రోల్ మీద కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ టాక్స్ రూ . 30వరకూ ఉంటుంది. రాష్ట్రాలు మరో ఇరవై వసూలు చేస్తాయి. ఇతర పన్నులు కలుస్తాయి. సెస్‌లు… సర్ చార్జీలు అదనం. అన్నీ కలిపి ప్రజలను పిండేస్తున్నారు. ఈ ఆదాయంలో ప్రధానమైన వాటా కేంద్రానికే వెళ్తుంది. యూపీఏ హయాంలో ఏటా రూ. 60 వేల కోట్ల ఎక్సైజ్ టాక్స్ పెట్రో ఉత్పత్తులపై వస్తే ఇప్పుడు అది నాలుగు లక్షల కోట్లకు చేరింది. అంటే పన్నును ఎన్ని రెట్లు పెంచారో ఊహించడం సులభమే.
కేంద్రం దీపావళి పండగ చేస్కోండి అని పది రూపాయలు తగ్గించింది. కానీ ఎక్సైజ్ టాక్స్ శాతాన్ని తగ్గించలేదు. ఇక్కడే పెద్ద మోసం జరిగింది. టాక్స్ అంతే ఉంది… కానీ వ్యాట్ తగ్గించాలని రాష్ట్రాలను మోదీ కోరుతున్నారు. కేంద్రం ఎక్సైజ్ టాక్స్ తగ్గిస్తే ఆటోమేటిక్‌గా ఆ శాతం మేర వ్యాట్ తగ్గిపోతుంది. కానీ కేంద్రం ఆ పని చేయడం లేదు. అటు కేంద్రం.. ఇటు రాష్ట్రాలు ఎవరికి వారు రాజకీయం చేస్తున్నారు కానీ ప్రజల్ని మాత్రం వదలడం లేదు.. పెట్రోల్ బంక్ వైపు వెళ్తే దోపిడీ చేస్తున్నారు. ఈ పెట్రో ధరల విషయంలో 90 శాతం కేంద్రానిదే పాపం.. మిగతాది రాష్ట్రాలది !