సర్వేల్లో తనకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయని ఎమ్మెల్యేలకు నలభై శాతం మార్కులు రావడం లేదని జాగ్రత్తగా ఉండాలని జగన్ హెచ్చరికలు జారీ చేసి పంపించారు. ఎప్పుడూ ప్రజల్లోనే ఉండాలన్నారు. మిగతా విషయాల సంగతేమో కానీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ తమను బలి చేయబోతున్నారేమోనన్న అనుమానంలోకి వెళ్లిపోతున్నారు. ఎందుకంటే పేరుకే ఎమ్మెల్యేలు కానీ ఈ మూడేళ్లలో నియోజకవర్గానికి రూ. కోటి ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసిన పరిస్థితి లేదు. కానీ బిల్లుల వస్తాయని పార్టీ నేతలతో చేయించిన పనులు బిల్లులు మాత్రం కోట్లకు కోట్లు పెండింగ్లో ఉన్నాయి.
ఇప్పుడు ఆ బిల్లులు సంగతి చెప్పకపోగా.. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నట్లుగా జగన్ మాట్లాడుతున్నారు. పాలనా పరంగా చూసినా మొత్తం జగనే. సర్వం జగన్నాథం అన్నట్లుగా పాలన సాగుతోంది. సంక్షేమ పథకాల విషయంలో కానీ.. ఇతర అంశాల్లో కానీ ఎమ్మెల్యే్ల ప్రమేయం లేదు. తమకన్నా వాలంటీర్లు నయమని ఎమ్మెల్యేలు అనుకునే పరిస్థితి వచ్చింది. ఓ వైపు నిధులు ఇవ్వకుండా.. మొత్తం అధికారాలు జగన్మోహన్ రెడ్డి వద్ద దఖలు పర్చుకుని చిన్న చిన్న పనులు కూడా వాలంటీర్లతో చేయించుకోవాల్సిన దుస్థితిలో పడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తమపై అసంతృప్తి ఎలా అని మథనపడుతున్నారు.
తమ ప్రభుత్వంపై అసంతృప్తి లేదని.. ఎమ్మెల్యేలపైనే ఉందని.. ఎమ్మెల్యేలందర్నీ మార్చేస్తే.. మళ్లీ వైసీపీకే పట్టం కడతారన్న వ్యూహంతో జగన్ ఉన్నారన్న అనుమానాలు ఆ పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయి. తాను గొప్పగా పరిపాలన చేస్తున్నానని.. సర్వేలో తనకు అరవై శాతానికిైగా సానుకూలత వచ్చిందని చెప్పుకోవడంమే దీనికి నిదర్శనమంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలు ఇప్పుడు తమను బలి పశువుల్ని చేస్తారేమో అని ఆందోళన చెందుతున్నారు.