ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్తో మరోసారి భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన గవర్నర్ మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఏపీకి సంబంధించి కీలకమైన నివేదికలు సమర్పించినట్లుగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన ఢిల్లీ నుంచి రాగానే జగన్మోహన్ రెడ్డి ఆయనతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. గవర్నర్ రావడంతో గురువారం రాజ్ భవన్కు వెళ్లి జగన్ ఆయనతో భేటీ కానున్నారు. కేంద్రానికి ఎలాంటి నివేదికలు ఇచ్చారు. .. కేంద్రం స్పందన ఏమిటి అన్న అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
ఏపీ ప్రభుత్వ అప్పులు ఇప్పుడు ఢిల్లీలోనూ చర్చనీయాంశమవుతున్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితే దారుణంగా ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. పైగా నేరుగా గవర్నర్నే వ్యక్తిగత పూచీదారుగా పెట్టి రూ. పాతిక వేల కోట్లు తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాధనాన్ని ఇతర ఖాతాలకు మళ్లించి వాటిని అప్పులకు గ్యారంటీలుగా మారుస్తున్నారన్న అనుమానాలున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ నివేదిక ఢిళ్లీలో తీసుకునే నిర్ణయాలకు కీలకమయ్యే అవకాశం ఉంది.
అయితే గవర్నర్ ప్రభుత్వానికి వ్యతిరేక నివేదికలు సమర్పించే అవకాశం లేదని వైఎస్ఆర్సీపీ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. ఎందుకంటే జగన్ సర్కార్ ఎంత రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా వెంటనే ఆలోచించకుండా ముద్ర వేయడంలో గవర్నర్ మంచి మార్కులు తెచ్చుకున్నారు. కోర్టులు వాటిని కొట్టి వేసినా ఆయన చీమ కుట్టినంత కూడా సిగ్గుపడలేదు. ఇప్పుడు కూడా తమకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వరని. ..కానీ ఢిల్లీ స్పందనేమిటో తెలుసుకోవడం మంచిదని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.