ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. షెడ్యూల్ ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన జరగాల్సి ఉన్న సీఎంలు, చీఫ్ జస్టిస్‌ల సమావేశానికి 30వ తేదీన ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కానీ ఒక రోజు ముందుగానే వెళ్లి ప్రధాని మోదీతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. భేటీ తర్వాత పాత ప్రెస్ నోట్ లో కొన్ని మార్పులేమైనా చేసి విడుదల చేస్తారేమో కానీ ప్రధానంగా జగన్ చర్చించబోయేది అప్పులకు పర్మిషన్లని చెబుతున్నారు. ఇప్పటి వరకూ కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులకు పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వలేదు.
ఏపీ ప్రభుత్వం ఎన్నెన్ని అప్పులు చేసిందో లెక్కలు చెప్పడానికి సిద్ధపడటం లేదు. అప్పులకు మేకోవర్ చేసి.. ఎలాగోలా కొత్త అప్పుల పర్మిషన్ తెచ్చుకుందామని ప్రయత్నిస్తున్నారు. కానీ అలాంటి అవకాశం ఇవ్వడం లేదు. అరకొర వివరాలతో ఇచ్చిన నివేదికను కేంద్రం తిరస్కరించింది. అంతే కాదు.. పని చేతకాదా అని తీవ్రంగా మండిపడటంతో ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్.. వారం రోజుల పాటు సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు సత్యనారాయణ అనే అధికారి ఇద్దరు కన్సల్టెంట్లతో కలిసి కొత్త నివేదికపై కుస్తీ పడుతున్నారు. కేంద్రానికి ఆ నివేదిక ఇస్తే.. కేంద్రం మదింపు చేసి.. కొత్తగా ఏపీ ప్రభుత్వానికి ఎన్ని అప్పులు చేయవచ్చో లెక్కలేసి పర్మిషన్ ఇస్తుంది.
నెలకు ఐదారువేల కోట్లు అప్పులు రాకపోతే బండి నడవని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం గత నెలలో ఎలాగోలా బతిమాలుకుని రూ. నాలుగువేల కోట్లు అప్పు తెచ్చుకుంది. కానీ వచ్చే నెల గండం గట్టెక్కడానికి మాత్రం అదనపు అప్పులకు కేంద్రం పర్మిషన్ ఇవ్వడం లేదు. అప్పుల లెక్కలు తేలాల్సిందేనని అంటోంది. ప్రతీ ఏడాది ఉదారంగా అప్పులకు పర్మిషన్ ఇచ్చే కేంద్రం ఈ సారి గట్టిగా పట్టుబడుతూండటంతో రాష్ట్ర ప్రభుత్వానికీ దిక్కుతోచడం లేదు. బ్యాంకులూ అప్పులు ఇవ్వడం లేదు. బ్యాంకులు కూడా భయపడుతున్నాయి. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలా అని టెన్షన్ పడుతున్నారు. అత్యవసరంగా అప్పులకు పర్మిషన్ అడిగేందుకు ఢిల్లీ అవకాశాన్ని జగన్ వినియోగించుకునే అవకాశం ఉంది.