“పక్క” రాష్ట్రం గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేసిన వైసీపీ చివరికి.. ఓ వివరణ ట్వీట్ చేయించుకోగలిగింది. తాను రాజకీయ ఉద్దేశంతో అనలేదని అన్యాపదేశంగానే అన్నానన్నారు. జగన్ నాయకత్వంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని కేటీఆర్ అర్థరాత్రి ట్వీట్ చేశారు. ఈ వివరణతో వైసీపీ నేతలు కాస్త రిలీఫ్ ఫీలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్ కామెంట్స్ పై ఏపీలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీన్ని కవర్ చేసుకోలేక మంత్రులు నానా తంటాలు పడ్డారు. టీడీపీ నేతల్ని తిట్టినట్లుగా కేటీఆర్‌ను తిట్టలేరు. అలాగని ఆయన వ్యాఖ్యలను సమర్థించలేరు. రోజంతా పడిన టెన్షన్‌కు అర్థరాత్రి కాస్త రిలీఫ్ ఇచ్చారు కేటీఆర్.
కేటీఆర్ ఏ ఉద్దేశంతో చేసినా .. అవి నిజమైనప్పటికీ రాజకీయంగా తమకు చాలా నష్టదాయకం అని చాలా తీవ్ర స్థాయిలో కేటీఆర్‌పై ఒత్తిడి తెచ్చి ఆ ట్వీట్ పెట్టించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ట్వీట్‌లోనూ ఎక్కడా ఆయన తాను చెప్పిన మాటలు తప్పని.. తన ఫ్రెండ్ అబబ్దం చెప్పాడని కేటీఆర్ చెప్పలేదు. తన మాటలు మిత్రుల్ని బాధించాయని మాత్రమే అన్నారు. అంటే తాను అన్న మాటలు కరెక్టేనని ఆయన మాటలకు ఫిక్సయినట్లే.
వైసీపీ నేతలు పరువు పోకుండా ఉండటానికి.. ఏదో ప్రయత్నం చేశారు కానీ.. చేతులు కాలిన తర్వాత వారు ఆకులు పట్టుకున్న చందంగా డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీ పరిస్థితి ఎలా ఉన్నా.. రాజకీయంగా మాత్రం తమకు డ్యామేజ్ కలగకూడదన్న లక్ష్యంతో వైసీపీ నేతలు చివరికి ఓ ట్వీట్ చేయించగలిగారు. దాని వల్ల వారికి ఎంత లాభమో కానీ.. టీఆర్ఎస్తో దోస్తీ చెడిపోలేదన్న ఓ సంకేతం మాత్రం ప్రజల్లోకి వెళ్లిపోయింది.