ప్రతి ఒక్కరూ తన పాదాలకు నమస్కారం పెట్టాలనుకునే మైండ్ సెట్ వైసీపీ నేతల్లో పెరిగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. తమ పాదదాసులే అయి ఉండాలని వారు అనుకుంటున్నారు. ఇటీవల మంత్రివర్గ ప్రమాణస్వీకారం రోజు.. పది మంది మంత్రులు సీఎం జగన్ కాళ్లకు నమస్కారం చేశారు. తాము మోకాళ్లపై కూర్చుని మరీ జగన్ పాదాలను తడిమారు. అప్పుడే ఏపీలో దుమారం రేగింది. తమిళనాడు తరహా కక్ష రాజకీయాలే కాదు.. వ్యక్తి పూజకూడా వచ్చేసిందని చెప్పుకున్నారు. అయితే అలా పాదనమస్కారాలు చేసిన వారిలో ఒక్కరు కూడా రెడ్డి సామాజికవర్గం వారు లేకపోవడంపై అనేక చర్చలు నడిచాయి.
అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదని.. ఆ పార్టీలో మరికొంత మంది నేతలకూ అలాంటి కోరికలే ఉన్నాయనడానికి అనేక ఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా వైవీ సుబ్బారెడ్డికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మోకాళ్లపై ప్రణమిల్లి కృతజ్ఞతలు చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి ఎవరు ? ఆయన చేసిన మేలేంటి ? ఆయన సొంత మేలు చేశారా ? ఇలాంటివన్నీ ఆలోచిస్తే మంత్రి చేసిన పనికి చాలా మంది సిగ్గుతో తలదించుకున్నారు. మంత్రిగా ఇవాళ ఉంటారు..
రేపు ఉండరు కానీ.. కమ్యూనిటీ మొత్తాన్ని ఆయన కాళ్ల దగ్గర పెట్టినట్లుగా ఆయన మాట్లాడారు. ఇది కూడా చర్చనీయాంశమవుతోంది. కమ్యూనిటీ రాజకీయాలు చేసి.. వారందరూ తమ కాళ్ల దగ్గర ఉన్నారన్న అభిప్రాయాన్ని కల్పించడానికి ఇలాంటివి చేస్తున్నారన్న అభిప్రాయం కల్పిస్తున్నారు. కారణం ఏదైనా కానీ ఏపీ రాజకీయాలు భిన్నంగా నడుస్తున్నాయి. ప్రజల్ని బానిసలుగా ట్రీట్ చేసే పరిస్థితులు వచ్చాయి. ఈ జాడ్యం రాను రాను పెరిగిపోతోంది. ఈ పరిస్థితి ఆత్మాభిమాన పోరాటానికి దారి తీస్తే… కాళ్లు మొక్కించుకునే పాలకవర్గానికి గట్టి దెబ్బతగడం ఖాయం.