ఏపీ డిప్యూటీ సీఎంగా రెండో సారి కూడా పదవి దక్కించుకున్న ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి తన శాఖ పరంగా చేసిందేమీ లేదు. ఎప్పుడూ నియోజకవర్గంలోనే ఉంటారు. అయితే ఆయన ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెడ్డి సామాజికవర్గాన్ని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. అవన్నీ ఆయన రెడ్డి సామాజికవర్గం మంచి కోసమే చెబుతున్నట్లు ఉంటున్నాయి కానీ.. కాస్త లోతుగా ఆలోచిస్తే వారి ఆధిపత్యంపై ఆయన ఆవేదన కనిపిస్తుందని అంటున్నారు.
ఇటీవల రెడ్లంతా ఎస్సీలుగా పుట్టాలనుకుంటున్నారని తేల్చేశారు. ఎందుకంటే ఎస్సీలకు రెడ్లంతటి ప్రాధాన్యం లభిస్తుందని ఆయన ఊవాచ. కానీ అసలు ఆయన ఉద్దేశం.. తాను ఎక్సైజ్ మంత్రిని అయినా… డిప్యూటీ సీఎంను అయినా జిల్లాలో కూడా కనీసం ఓ చిన్న పని చేయించలేకపోతున్నానని అంతా పెద్దిరెడ్డి కనుసల్లోనే జరుగుతోందని.. చెప్పడమంటున్నారు. పెద్దిరెడ్డి సరే అంటేనే ఆయనకు పదవి వచ్చింది. పెద్దిరెడ్డి మళ్లీ ఒప్పుకుంటేనే ఆయనకు టిక్కెట్ వస్తుంది. అందుకే ఆయనలో అసంతృప్తి అలా బయటపడిందని చెబుతున్నారు.
అంతటితో ఆగలేదు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా రెడ్ల గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. రెడ్లు కలసి కట్టుగా లేకపోతే ఓడిపోతానని చెబుతున్నారు. గ్రామాల్లో రెడ్లు రెండు వర్గాలుగా విడిపోయారని.. అంటున్నారు. చిన్న చిన్న సమస్యలకే పోట్లాడుకుంటారని.. అలా పోట్లాడుకుని దళిత వాడలపై పడతారని ఆయన అంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో… లేకపోతే నిజంగానే ఆవేదనతో చేస్తున్నారో కానీ పదే పదే రెడ్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం వైసీపీలో కలకలం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతూండటం కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.