ఢిల్లీలో ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సు జరిగింది. ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం హాజరు కాలేదు. చీఫ్ జస్టిస్‌పై గతంలో అవినీతి ఆరోపణలు చేసిన జగన్ ఆ తర్వాత ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ స్వాగతాలు పలికారు. ఇప్పుడు సమావేశం అనగానే వెళ్లిపోయారు. కేసీఆర్ మాత్రం మొదటి నుంచి జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో సానుకూలంగానే ఉన్నారు. హైదరాబాద్‌లో జరిగిన పలు సమావేశాల్లో కేసీఆర్‌ను సీజేఐ పొగిడారు కూడా. అయినా ఢిల్లీలో జరిగిన సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదు.
ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయనకు ఎదురుపడటం ఇష్టం లేక హాజరు కాలేదని భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. న్యాయవ్యవస్థ బలోపేతం, న్యాయవ్యవస్థ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు, కోర్టుల్లో న్యాయమూర్తుల భర్తీ, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, జిల్లా కోర్టుల అవసరాలకు తగ్గట్టు సిబ్బందికి సంబంధించిన విధాన రూపకల్పనపై ఈ సదస్సులో చర్చించారు.
ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్‌పై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో న్యాయవ్యవస్థ సమస్యలను సీఎం, హైకోర్టు సీజే పరిష్కరించాలన్నారు. నిర్ణయాలను అమలు చేయకుండా సీఎస్ పెండింగ్‌లో ఉంచడంపై మండిపడ్డారు. కోర్టుల్లో దయనీయమైన పరిస్థితులున్నాయని సీజేఐ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు.