కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు రకరకాలుగా స్పందించారు. కొంత మంది ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు డ్రగ్స్‌తో కూడా కొంత మంది ముడి పెట్టారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు చేసిన మతి లేని వ్యాఖ్యలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు . ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతలు పద్ధతి తప్పి మాట్లాడటం సరికాదన్నారు.
మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ నేతలు కావాలనే ప్రచారం చేస్తున్నారని .. వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారని తలసాని అంటున్నారు. ఏపీ నేతలు ప్రతిపక్ష నాయకుల్లా వ్యవహరిస్తున్నారని .. ఏపీని తమ కంటే అభివృద్ధి చేస్తే సంతోషమన్నారు. హైదరాబాద్‌లో కరెంట్ ఉండటం లేదన్న బొత్స సత్యనారాయణ ఎప్పుడు జనరేటర్ వినియోగించారో చెప్పాలన్నారు. ఏపీలో పవర్ కట్‌పై వాళ్ళే బహిరంగంగా ప్రకటించుకున్నారని గుర్తు చేశారు.
టీడీపీ హయాంలో ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడానికి ముందుగానే తలసాని వచ్చేవారు. ఇప్పుడు కూడా ఆయనే ముందుకు వస్తున్నట్లుగా కనిపిస్తోంది. అనుకోకుండా వ్యాఖ్యలు చేశానని కేటీఆర్ ఆర్థరాత్రి ట్వీట్ పెట్టిన తర్వాత కూడా టీఆర్ఎస్ మంత్రులు.. వైసీపీ మంత్రులపై ఎదురుదాడికి చేయడం.. అనుకోకుండా చేసింది కాదని భావిస్తున్నారు. తలసాని వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.