ఏపీపై ఆరోపణలు చేసే విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా ఏపీ అంటేనే కల్తీ ఎరువులు అనే ముద్ర వేసేందుకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తన నియోజకవర్గంలో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున నకిలీ ఎరువులు బయటపడుతున్నాయి. రైతులు నష్టపోతున్నారు. ఏపీ సరిహద్దుల్లో ఉండే ఈ నియోజకవర్గంలో ఎరువులు ఏపీ నుంచే వస్తున్నాయంటున్నారు.
సత్తుపల్లికి సరిహద్దుల్లో ఏపీ రాష్ట్ర భూభాగంలోని మామిడితోటల్లో నకిలీ ఎరువులు తయారు చేస్తున్నారని ఆయన చెబుతున్నారు. సరఫరాదారుడిని ఏపీ వ్యక్తిగా గుర్తించారని అతనిపై పీడీ యాక్టు నమోదుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కూడా కోరారు. ఇటీవల సత్తుపల్లిలో నకిలీ ఎరువుల గుట్టు రట్టయిన ఘటనలో తయారీదారుడిపై చర్యలు తీసుకునే విషయంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావడంతో ఆ సమస్యపై కలెక్టర్ వీపీ గౌతమ్‌ను శుక్రవారం ఎమ్మెల్యే సండ్ర కలిశారు.
కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇసుకకు పోటాష్ రంగును కలిపి పంపాడని, సత్తుపల్లిలో పట్టుబడిన ఆ ఎరువును, గోదామును జిల్లా అధికారులు సీజ్ చేశారని చెప్పారు. కల్తీ ఎరువులు, విత్తనాలు, నకిలీ పురుగుమందులు ఏపీ నుంచి తెలంగాణకు సరఫరా అవుతున్నాయని, వీటిని నియంత్రించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇంతటితో వదిలి పెట్టేలా లేరు. కల్తీ ఎరువులు.. కల్తీ విత్తనాలు.. నకిలీ మందులు అంటే.. కేసీఆర్ సీరియస్ అవుతారు. ఈ విషయాన్ని సండ్ర కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే .. మరో వివాదం అయ్యే అవకాశం ఉంది.