చిరంజీవితో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు జట్టు కట్టారు. సూపర్ హిట్ జోడీ అనిపించుకున్నారు. కానీ… రాధికతో చిరుకి ఉన్న కెమిస్ట్రీనే వేరు. ఇద్దరి కాంబోనే వేరు. సిల్వర్ స్క్రీన్‌పై మెప్పించిన ఈ జంట.. నిజ జీవితంలోనూ అంతే క్లోజ్ గా ఉంటారు. `నా ఫ్యామిలీ ఫ్రెండ్ రాధిక.. తనంటే నాకు చాలా అభిమానం` అని చిరు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. రాధిక కూడా `ఎప్పటికీ నా ఫేవరెట్ హీరో చిరునే` అని చెబుతూరనే ఉంటుంది. శరత్ కుమార్ కూడా చిరుకి బాగా ఆప్తుడు.
ఇప్పుడు ఈ స్నేహంతోనే.. రాధికకు ఓ మాట ఇచ్చాడు చిరు. రాధిక నిర్మాతగా.. ఓ సినిమా చేస్తానని చిరు అభయహస్తం అందించాడట. రాడాన్ పేరుతో రాధిక నిర్మాణ రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా టీవీ సీరియళ్లపై ఫోకస్ పెట్టిన రాధిక.. త్వరలోనే తెలుగులో ఓ భారీ సినిమాని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఆ సినిమా చిరంజీవితోనే అవ్వాలన్నది తన ఆశ. చిరు కూడా రాధికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ విషయాన్ని రాధిక సైతం ట్విట్టర్లో ప్రకటించి తన ఆనందాన్ని పంచుకుంది. `త్వరలో మా రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్ లో మీరో ప్రాజెక్ట్ చేయడానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు. కింగ్ ఆఫ్ మాస్ అయిన మీతో ఓ బ్లాక్ బస్టర్ తీయడానికి ఎదురు చూస్తున్నాను’.. అంటూ రాధిక ట్వీట్ చేశారు. దర్శకుడు, ఇతర వివరాలూ ఇంకా తెలియాల్సివుంది.