ఆరో తేదీన నిర్వహించే రైతు సంఘర్షణ సమితి సమావేశాన్ని రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సభలో రాహుల్‌తో మినీ మేనిఫెస్టోను ప్రకటించాలని భావిస్తున్నారు. రైతు అంశాలే ఎజెండాగా తీసుకుని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే అంశాలను వ్యవసాయ మేనిఫెస్టో ద్వారా చెప్పాలని భావిస్తున్నారు. రైతులకు మద్దతు ధర, పంట పెట్టుబడి సాయం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మద్దతు ధర కల్పించడం, ధాన్యం కొనుగోళ్లు, రైతులు ఏ పంటలు వేసినా వాటికి అనుకూలంగా మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి హామీలను రాహుల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.
రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఓ బృందాన్ని నియమించి.. దీనిపై కసరత్తు చేయిస్తుననారు. అసైన్డ్ భూముల వ్యవహారాన్ని కూడా దీనిలో చేర్చనున్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు అసైన్డ్ భూములు పంచిందని, కానీ, టీఆర్ఎస్ వాటిని గుంజుకుంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద రైతులకు ఏం చేస్తారో వివరించనున్నారు. కౌలు రైతులపై కూడా కీలకమైన అంశాలను ప్రస్తావించనున్నారు. కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం వంటి అంశాలపై వ్యవసాయ మేనిఫెస్టోలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి వ్యవసాయ మేనిఫెస్టోను రైతువర్గాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం వేస్తున్నారు. వరంగల్ సభ సందర్భంగా రాష్ట్రంలో చనిపోయిన రైతుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. వాళ్లతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు. ఓయూలో అనుమతి నిరాకరించినప్పటికీ.. రాహుల్ సభ విషయంలో రేవంత్ రెడ్డి… పక్కా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.