రాజకీయం చేయాలనే ఆలోచనలు బుర్ర నిండుగా ఉన్న ప్రశాంత్ కిషోర్‌కు ప్రస్తుతం ఉన్న పార్టీల్లో చేరాలనే ప్రయత్నాలు వర్కవుట్ కావడం లేదు. దీంతో ఆయన సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మూడు రోజుల కిందట వరుసగా కొన్ని మీడియాలకు ఇంటర్యూలు ఇచ్చిన ఆయన 2024 ఎన్నికల్లో తన పాత్ర ఖచ్చితంగా రాజకీయ నాయకుడిగానే ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే అది ఎలా అనేది తనకు తెలియదన్నారు. కానీ ఆయన అలా సమాధానం చెప్పడానికి ముందే ప్రత్యేక పార్టీ ఆలోచనను ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
సోమవారం ఉదయమే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. తమ పార్టీ హోమ్ స్టేట్ బీహార్‌గా ఎంచుకున్నారు. ప్రశాంత్ కిషోర్ బీహార్‌కు చెందిన వ్యక్తి. బీహార్లోనే రాజకీయాలు చేయాలనుకుని మొదట జేడీయూలో చేరారు. తన వారసుడిగా నితష్ కుమార్ .. పీకేను ప్రకటించారు. కానీ అక్కడ స్థానిక నేతల రాజకీయాలను కూడా తట్టుకోలేకపోయారు. పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుదామని తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి ప్రయత్నం బెడిసికొట్టింది. ఇప్పుడు సొంత పార్టీ మినహా మరో దారి లేకుండా పోయింది.
ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. బీహార్ తన కార్యక్షేత్రం అన్నారు కాబట్టి నేరుగా పార్లమెంట్ ఎన్నికల్లోనే పోటీ చేసే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ అంటే జాతీయ స్థాయిలో రాజకీయ వర్గాల్లో బాగా నానిన పేరు. ఆయన పట్టుకుంటే గెలుపే అని చెప్పుకుంటారు. అయితే అది రాజకీయ పార్టీలకు. తాను సొంతంగా పార్టీ పెడితే ఎలా ఉంటుంది.. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చెప్పడం కష్టమే. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో పీకే పార్టీ ద్వారా తేలిపోయే అవకాశం ఉంది.